రాయికోడ్​ కస్తూర్బా స్కూల్​లో..స్టూడెంట్​ ఆత్మహత్యాయత్నం

రాయికోడ్​ కస్తూర్బా స్కూల్​లో..స్టూడెంట్​ ఆత్మహత్యాయత్నం
  • బిల్డింగ్​పై నుంచి దూకిన విద్యార్థిని
  • తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిక 
  • పాఠశాలలో చదవడం ఇష్టం లేకనే.. 

రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్​మండల కేంద్రంలోని  కస్తూర్బా గాంధీ స్కూల్​కు చెందిన ఓ  స్టూడెంట్​ఆత్మహత్యాయత్నం చేసింది. ఝరాసంగం మండలం ప్యాలారం గ్రామానికి చెందిన దశరథ్​, సుజాతల పెద్ద బిడ్డ స్నేహ (14) ఆరో తరగతి నుంచి రాయికోడ్​కస్బూర్బా స్కూల్​లో చదువుతోంది. సమ్మర్​హాలీడేస్​తర్వాత స్కూల్​మళ్లీ ప్రారంభం కావడంతో సోమవారం ఉదయం స్నేహ తన తల్లిదండ్రులతో కలిసి  వచ్చింది.  

అయితే, తాను ఇంట్లోనే ఉండి చదువుకుంటానని, ఈ స్కూల్​కు వెళ్లనని పేరెంట్స్​తో  మొండికేసింది. దీంతో వారు ఈ ఒక్క సంవత్సరం చదివితే పదో తరగతి పూర్తవుతుందని నచ్చజెప్పారు.. అయితే తన చెల్లెలు వెంట ఉంటేనే స్కూల్​లో చదువుతానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. భయపడ్డ వారు చిన్నకూతురికి 8 వ తరగతిలో సీట్ ఇవ్వాలని స్కూల్​లో అడిగారు. ఖాళీలు లేవని చెప్పడంతో  అది విన్న స్నేహ తనను ఇక్కడే చదివిస్తారని భయపడి స్కూల్​ బిల్డింగ్​ ఎక్కి అందరూ చూస్తుండగానే దూకింది. తీవ్రంగా గాయపడిన  స్నేహను రాయికోడ్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జహీరాబాద్​ ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. స్నేహ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.