రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య

రాజ్యసభ సభ్యుడు  ఆర్.కృష్ణయ్య డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై అమలుపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్​చేశారు. కాచిగూడలో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వస్తున్న మోదీ , అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని, బీజేపీ వైఖరి ప్రకటించాలని కోరారు.

లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు బీజేపీకి  తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు ఒక్క పథకం అమలుచేయలేదని విమర్శించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్, రాజేందర్, వేముల రామకృష్ణ, ఉదయ్ నేత, సత్యనారాయణ, నాగరాజు, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.