నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ

నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? ..  సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ

బెళగావి(కర్నాటక): కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీ భారతదేశ రాజులు, మహారాజులను అవమానించారని, కానీ నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మాట్లాడడం లేదని ప్రధాని మోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్​ ముస్లిం రాజుల అకృత్యాలపై మౌనంగా ఉంటున్నారని అన్నారు. పేదల ఆస్తులు పెంచే పనిలో బీజేపీ ఉంటే.. రాహుల్, ప్రియాంక గాంధీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద లాక్కుంటామని.. వాటిని ఇతరులు పంచుతామని చెబుతున్నారని ఆరోపించారు. 

మోదీ బతికుండగా.. అలాంటి చర్యలను అనుమతించబోడని అన్నారు. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి, సిర్సి, దావణగెరెలో ఆదివారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, మాట్లాడారు. ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకొని దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్​ రాయించిందని ఆరోపించారు.  ‘ఈ రోజు కూడా ఆ పార్టీ యువరాజు ఆ పాపాన్ని మోస్తున్నారు. భారతదేశ రాజులు, మహారాజులు పేదల భూములను లాక్కున్నారని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, కిట్టూర్​ రాణి చెన్నమ్మలాంటి మహనీయులను అవమానించారు’ అని మోదీ విమర్శించారు. కానీ.. నవాబులు, నిజాంల అరాచకాలపై రాహుల్​ నోరు మెదపలేదన్నారు. మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబు అరాచకాలు రాహుల్​ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 

వారిని ప్రజలు తిరస్కరిస్తారు

అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెను ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు తిరస్కరిస్తారని మోదీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటిరోజే రామమందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కానీ వారు (కాంగ్రెస్) నిర్మించలేదని, అలాంటి గొప్ప పనులు చేయాలంటే 56 ఇంచుల ఛాతీ ఉండాలని పేర్కొన్నారు. చివరివరకూ ఆ శక్తులు (కాంగ్రెస్​) రామమందిర నిర్మాణం జరగకుండా అడ్డుపడ్డాయని, చివరి రోజున కూడా కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. కాంగ్రెస్​ సృష్టించిన అడ్డంకులను మరిచిపోయి రామ మందిర ట్రస్టీలు వారికి ఆహ్వానం అందజేశారని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. రామమందిరాన్ని ప్రజల డబ్బులతో కట్టామని చెప్పారు. 

ఒక్కో ఏడాది ఒకరికి పీఎం పదవా?!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అందులోని పార్టీలు ఒక్కో ఏడాది పీఎం పదవిని పంచుకోవాలనే ఫార్ములాను రూపొందించాయని మోదీ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యవస్థతో దేశానికి మేలు జరుగుతుందని ఆశించలేమని చెప్పారు. ఓటును వృథా చేయొద్దని ప్రజలకు సూచించారు.