బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ

బీజేపీ, బీజేడీ ఒక్కటే ..  ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ

కటక్: ఒడిశాలో బీజేపీ, బీజేడీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోరాడుతున్నట్టు బీజేపీ, బీజేడీ డ్రామాలు ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ ఉంది. అది భాగస్వామ్యమో లేక వివాహమో ఏమంటారో కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటే” అని అన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పని చేసినట్టే, ఒడిశాలో బీజేపీతో కలిసి బీజేడీ పని చేస్తున్నదని చెప్పారు. అక్కడి ప్రజలను బీఆర్ఎస్ దోచుకుంటే, ఇక్కడి ప్రజలను బీజేడీ దోచుకుంటున్నదని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించామని, ఒడిశాలోనూ బీజేడీని గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. 

ఆదివారం ఒడిశా కటక్ లోని సలేపూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం బిలియనీర్ల కోసమే పని చేస్తున్నదని, అలాగే ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కొంతమంది కోసమే పని చేస్తున్నదని ఆయన విమర్శించారు. ‘‘ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అయినప్పటికీ, ప్రభుత్వాన్ని మాత్రం ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ నడిపిస్తున్నారు. అంకుల్ జీ(మోదీ), నవీన్ బాబు ఒక్కటయ్యారు. మోదీ, నవీన్ పట్నాయక్, పాండియన్, అమిత్ షా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మైనింగ్ స్కామ్ ద్వారా రూ.9 లక్షల కోట్లు దోపిడీ చేశారు. భూకబ్జాలకు పాల్పడి రూ.20 వేల కోట్లు వెనకేసుకున్నారు. మొక్కల పెంపకం పేరుతో రూ.15 వేల కోట్లు దోపిడీ చేశారు” అని ఆరోపించారు. ఢిల్లీలో, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తామని చెప్పారు. దాన్ని ప్రజలకు పంచుతామని తెలిపారు.

కాంగ్రెస్ తోనే అందరికీ న్యాయం.. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ‘‘మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద కుటుంబాల్లో ఒక్కో మహిళకు ఏటా రూ.లక్ష అందజేస్తం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇస్తం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తం. రూ.500కే సిలిండర్ అందజేస్తం. పంట రుణాలు మాఫీ చేస్తం. అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తం. అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు డబుల్ చేస్తం. ఉపాధి కూలీల వేతనం రూ.400కు పెంచుతం” అని హామీ ఇచ్చారు. ‘‘ఆదివాసీలకు అడవులపై హక్కు లేదని బీజేపీ సర్కార్ అంటున్నది. ఆదివాసీల హక్కులను లాక్కుంటున్నది. అడవులపై మొదటి హక్కు ఆదివాసీలు, గిరిజనులకే ఉన్నది” అని అన్నారు.  

రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర.. 

రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయి. ఇన్ని రోజులు రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్.. ఇప్పుడు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ ప్రకటనలు చేస్తోంది. ఆర్ఎస్ఎస్  గతంలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 
– డామన్ డయ్యూలో రాహుల్​ గాంధీ