కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

కేరళలో పోలింగ్ అవకతవకలు ..  ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

తిరువనంతపురం: కేరళలో ఈనెల 26న జరిగిన మొదటి దశ లోక్ సభ పోలింగ్ లో విపరీతమైన అవకతవకలు జరిగాయని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్  ఆరోపించారు. ఆ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఓ లేఖ రాశారు. చాలా బూత్ లలో ఆలస్యం జరిగిందని, ఓటర్లు తమ వంతు కోసం నాలుగైదు గంటల పాటు ఎదురుచూశారని ఆయన పేర్కొన్నారు. ‘‘కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు అవస్థ​లు పడ్డారు.

 ఎండలో వేచి చూసి చూసి తిరిగివెళ్లిపోయారు. పోలింగ్  కేంద్రాలకు సాయంత్రం ఆరు లోపలే చేరుకున్నా పలువురిని అధికారులు అడ్డుకున్నారు. చాలా పోలింగ్  బూత్ లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందువల్లే ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈవీఎంలు కూడా సరిగ్గా పనిచేయలేదు. ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రక్రియను ఇంత అధ్వానంగా నిర్వహించడం ఎప్పుడూ చూడలేదు. ఇక ఓటర్ల లిస్టులు కూడా తప్పుల తడకగా ఉన్నాయి” అని సతీశన్  పేర్కొన్నారు.