కార్లు ఉన్న వారికీ ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో 2 వేల 500 మంది అనర్హులు !

కార్లు ఉన్న వారికీ ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో 2 వేల 500 మంది అనర్హులు !
  • కార్లు ఉన్న వారికీ ఇందిరమ్మ ఇండ్లు.. అధికారుల సర్వేలో బట్టబయలు..
  • బిల్లులు ఆగిపోవడంతో అధికారుల వద్దకు లబ్ధిదారుల క్యూ
  • అయోమయంలో హౌసింగ్ ఆఫీసర్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్టీ లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అనంతరం అధికారులు చేసిన సర్వేలో ఆయనకు ఫోర్ వీలర్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఫోర్ వీలర్ ఉంటే ఇందిరమ్మ ఇంటికి అనర్హులు. బేస్ మెంట్ బిల్ సైతం లబ్ధిదారుడికి అందింది. దీంతో ఆ లబ్ధిదారుడికి మిగిలిన బిల్లు ఇవ్వకుండా హౌసింగ్ అధికారులు హోల్డ్ లో పెట్టారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు చేసిన సర్వేలో ఆ వ్యక్తికి గతంలో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి సాయం అందుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ వ్యక్తి బిల్ ను అధికారులు హోల్డ్ లో పెట్టారు. గతంలో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి సాయం పొందితే ఇందిరమ్మ ఇంటికి అనర్హుడని ప్రభుత్వం గైడ్ లైన్స్ లో ఉందని అతనికి స్పష్టం చేశారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,500 మంది అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు హౌసింగ్ అధికారుల సర్వేలో తేలింది. దీంతో వారి బిల్లులు రిలీజ్ చేయకుండా అధికారులు హోల్డ్ లో పెట్టారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ స్కీమ్ లో వంద శాతం పేదలకే ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలను నియమించారు. ఆ కమిటీ లబ్ధిదారులను ఫైనల్ చేసి ఎమ్మెల్యేలకు అందించగా, జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఇళ్లను మంజూరు చేశారు. ఇందిరమ్మ కమిటీల దగ్గరే కొంత మంది అనర్హులకు ఇళ్లు మంజూరు అయ్యాయని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.

నిర్మాణంలో రెండున్నర లక్షల ఇళ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించగా, ఇప్పటి వరకు 3.48 లక్షల ఇళ్లను కలెక్టర్లు మంజూరు చేశారు. ఇందులో 2.48 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. వీటిలో 20 వేల ఇళ్లు స్లాబ్ వరకు పూర్తి కాగా ఇప్పటి వరకు రూ.3,800 కోట్లను లబ్ధిదారులకు వివిధ దశల సాయం కింద ప్రభుత్వం చెల్లించింది.

ఫీల్డ్ సిబ్బందిపై చర్యలు..
స్కీం మొదలైనప్పటి నుంచి సిబ్బంది అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. గ్రామ కార్యదర్శి నుంచి హౌసింగ్ అధికారుల వరకు ఎవరైనా  లబ్ధిదారుల ఫోటో తీసి అప్ లోడ్ చేయటానికి, అప్రూవ్ చేయటానికి లంచాలు అడిగితే వారిని సస్పెండ్ చేస్తోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి లబ్ధిదారుడే ఇంటి నిర్మాణ పనులను ఫొటోలు తీసి నేరుగా ఇందిరమ్మ యాప్ లో అప్ లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా లబ్ధిదారులు తమ సమస్యలను, ఇంటి బిల్ స్టేటస్ తెలుసుకునేందుకు హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.