- గోకారం రిజర్వాయర్‌తో ఒరిగేదేమీ లేదు
- 1,500 ఎకరాలు తీసుకుని2వేల ఎకరాలకు నీళ్లిస్తారా?
- ఎర్రవల్లి గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించినా ఆరా తీయలే
- రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో జాగృతి జనంబాట
ఆమనగల్లు/వంగూరు/అచ్చంపేట, వెలుగు: గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టిన గత ప్రభుత్వాలు.. కృష్ణా నదీ జలాలను ఎందుకు పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కృష్ణా జలాలతో 25 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు రావాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినా.. ఎన్నో వేల ఎకరాలకు నీళ్లు పారేవి అని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని దుయ్యబట్టారు.
జాగృతి జనంబాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మైసిగండిలోని మైసమ్మ ఆలయాన్ని ఆదివారం కవిత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమనగల్ మండలంలో పర్యటించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తలకొండపల్లి మండలం సన్న, చిన్న కారు రైతులతో సమావేశం అయ్యారు. తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో దీక్ష చేపట్టిన ముంపు గ్రామాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. అనంతరం కవిత మాట్లాడారు. ‘‘డిండి ప్రాజెక్ట్ కింద ప్రతిపాదించిన గోకారం రిజర్వాయర్ కోసం గోకారంలో 900 ఎకరాలు, ఎర్రవెల్లి గ్రామంలో 600 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. బస్వాపూర్ రిజర్వాయర్ కింద 1.80 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలుగుతున్నది. అదే ఇక్కడి రైతులు 1,500 ఎకరాలు ఇస్తే 2వేల ఎకరాలకు నీళ్లు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం?’’అని కవిత మండిపడ్డారు.
ఎర్రవల్లి గ్రామస్తులు.. తెలంగాణవాసులు కాదా?
గోకారం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నా.. ఎర్రవల్లి గ్రామ ప్రజలంతా సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారని కవిత తెలిపారు. అయినా.. ఎమ్మెల్యే, ప్రతిపక్షాలు స్పందించకపోవడం దుర్మార్గమని చెప్పారు. ‘‘ఎన్నికల కమిషన్ కూడా కారణాలు తెలుసుకునేప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు. ఓటు హక్కు ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదంటే.. ఎర్రవల్లి గ్రామస్తులు తెలంగాణవాసులు కాదా? ఈ విషయాన్ని అంతతేలికగా వదిలే ప్రసక్తే లేదు’’అని కవిత అన్నారు.
చెంచులతో మమేకం
నాగర్ కర్నూల్ జిల్లా ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని అప్పాపూర్ చెంచు పెంటను కవిత ఆదివారం సందర్శించారు. వారి ఆవాసాలకు వెళ్లి జీవన స్థితిగతులను పరిశీలించారు. 2 గంటలకు పైగా చెంచులతో ముచ్చటించారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లమలలోని చెంచులను కాపాడుకునేందుకు జాగృతి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెంచు మహిళలకు సారె పెట్టారు. అంతకుముందు శనివారం రాత్రి సాలాపూర్ తండాలో బస చేసిన కవిత.. సేవాలాల్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
