మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: క్రీడా యూనివర్సిటీని ఎప్పుడు ప్రారంభిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న క్రికెట్ రెండో ఇన్నింగ్స్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన క్రీడా యూనివర్సిటీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో చూపించాలని సూచించారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు విజ్ఞానం, పరిశోధనలు, ఉపాధినిచ్చే కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని, బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కిల్లె గోపాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, పీయూ అధ్యక్ష, కార్యదర్శులు బత్తిని రాము, రాజేశ్ యాదవ్, ఉపాధ్యక్షుడు శేఖర్, రాకేశ్, పవన్, దత్తు, సుధాకర్, విజయ, మనీషా, శ్రీను, దినకర్, హనుమంతు, పరమేశ్ పాల్గొన్నారు.
