- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
సత్తుపల్లి, వెలుగు : ఆదాయ మార్గాలు పెంచుకొని గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ పెద్ద దాసరి వెంకట రామిరెడ్డి రూ.1.25 కోట్ల సొంత నిధులతో ఇంటిగ్రేడెడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం, సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతానికి పూర్వం నుంచి మంచి పేరు ఉందని, ఆ పేరును కాపాడుకోవాలని, నిబద్ధతతో రాజకీయాల్లో పని చేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, రాజకీయాల్లో క్యారెక్టర్ దెబ్బ తింటే ఎంత డబ్బు ఉన్న ఓడిపోతామని తెలిపారు. అంతకుముందుకేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దాసరి మదు మోహన్ రెడ్డి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
