రాజకీయాలకతీతంగా అభివృద్ధి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాజకీయాలకతీతంగా అభివృద్ధి  : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు:  స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగిన పట్టణం మధిర అని,  ఈ పట్టణంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర పట్టణంలో రూ.3కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. దేశ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి 86 మందితో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏర్పడిన అద్భుతమైన రోజు డిసెంబర్ 28 అని తెలిపారు.  మధిర పట్టణ ప్రజల అవసరాలు డ్రైనేజీ ఇతర ఏ సేవలకైనా తమ కోసం ఒక కార్యాలయం ఉంది, సిబ్బంది ఉన్నారు,  అన్న భావన కల్పించేందుకు ఈ భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. 

 పట్టణ విస్తీర్ణంతో ఇండ్ల నుంచి డ్రైనేజీ నీరు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఎంత గాలి, వర్షం వచ్చినా కరెంటు సరఫరా ఆగిపోదని చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్టే, మధిర పట్టణంలోని పేదలు నివసించడానికి జి ప్లస్ టు టవర్స్ తో హౌసింగ్ కాలనీ నిర్మించబోతున్నామని, త్వరలోనే ఈ కార్యక్రమానికి భూమి పూజ చేస్తామని వెల్లడించారు. కోర్టు కొత్త బిల్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మధిర పట్టణ వాసులకు తాజా కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు రైతు బజార్ ఏర్పాటు చేశామని తెలిపారు. డిగ్రీ, జూనియర్, కళాశాల తోపాటు హై స్కూల్ భవనానికి కొత్త బిల్డింగులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇతర అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలును వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, మధిర మున్సిపల్​ కమిషనర్​ సంపత్​కుమార్​, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కేశవ్​భవన్​లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ పార్టీ జెండాను  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం కేక్​ కట్​ చేశారు.