భోపాల్: బీజేపీ కౌన్సిలర్ భర్త ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని సత్నా జిల్లా రాంపూర్ బాఘేలన్ నగర్ పరిషత్ కౌన్సిలర్ భర్త అశోక్ సింగ్ గా గుర్తించారు. కర్హిలో నివసిస్తున్న అశోక్ సింగ్ ఆరు నెలల క్రితం ఓ మహిళను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటనను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. రేప్ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్చేశాడు. మహిళతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు మౌనాన్ని ఆశ్రయించగా.. అది అలుసుగా భావించిన అశోక్ సింగ్ ఈ నెల 20న మరోసారి ఆమెను వేధించాడు.
తాను చెప్పినట్టు వినకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో అశోక్ సింగ్‌ను బాధితురాలు నిలదీసింది. వీడియోను రికార్డ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. అశోక్ సింగ్ అహంకారంతో మాట్లాడాడు. ఎవరికి ఫిర్యాదు చేసినా తనకేమీ కాదని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బాధితురాలి ఫిర్యాదు మేరకు అశోక్ సింగ్‌పై పోలీసులు కేసును నమోదు చేశారు.
