స్వయం ఉపాధిపై యువత దృష్టి పెట్టాలి: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు

స్వయం ఉపాధిపై యువత దృష్టి పెట్టాలి: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు
  • కొత్త వ్యాపారాలతో ఉపాధి అవకాశాలు సృష్టించాలి
  • మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు

మేడిపల్లి, వెలుగు: చదువుకున్న నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం బోడుప్పల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కుబేరా ఫిల్లింగ్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

చదువుకున్న యువత స్వయం ఉపాధిపై శ్రద్ధ వహించాలని సూచించారు. కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కుబేరా ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్ బొమ్మకు కల్యాణ్ కుమార్, బొమ్మకు నిఖిల్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.