- కొత్త కార్డులే కాదు పాత కార్డుల్లో మెంబర్ల చేరికలకూ తప్పనిసరి
- చేసుకోని లబ్ధిదారులకు రేషన్ నిలిపివేస్తారనే ప్రచారం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. ఈ కేవైసీకి చేసుకోని వారికి రేషన్‌సరుకులు నిలిపివేస్తామని పౌరసరఫరాల శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని చెప్తున్నారు. వచ్చే నెల కోటా పూర్తయ్యేలోపైనా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త కార్డులు పొందిన వారితో పాటు పాత కార్డుల్లో కొత్తగా సభ్యులైన వారు దగ్గర్లోని రేషన్‌షాపులకు వెళ్లి ఈ–పాస్మెషీన్లో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు.
ఈ-కేవైసీ తప్పని సరి
రేషన్‌కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించాల్సిందేనని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రెండేండ్లుగా ఈ ప్రకియ కొనసాగుతున్నా లబ్ధిదారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని, దీంతో తరచూ గడువు పొడిగించాల్సి వస్తోందంటున్నారు. ఈసారి కూడా డిసెంబరు 20 వరకు గడువు విధించినా 80 శాతం మందే ఈ కేవైసీ చేయించారని అంటున్నారు.
అందుకే... ఈ- కేవైసీ...
హైదరాబాద్పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలోనే కార్డుల జారీకి ముందు 6,39,451 రేషన్‌కార్డులు ఉండగా ప్రస్తుతం 8.36 లక్షల పై చిలుకు కార్డులు నమోదయ్యాయి. గ్రేటర్‌పరిధిలో రేషన్‌కార్డుల వారీగా సభ్యుల విషయానికి వస్తే హైదరాబాద్ పరిధిలో 27,99,060 మంది ఉండగా, కొత్తగా 4,37,620 యాడ్అయ్యారు. మేడ్చల్పరిధిలో 20,48,224 మంది ఉండగా కొత్తగా 3,30,961 మంది నమోదయ్యారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 21,04,811 మంది ఉండగా కొత్తగా 2,82,930 మంది నమోదయ్యారు. రోజు రోజుకూ కార్డులతో పాటు లబ్ధిదారులు పెరిగిపోతుండడంతో వీటిలో బినామీలు, బోగస్ కార్డులను గుర్తించేందుకే అధికారులు తప్పని సరిగా కుటుంబంలో రేషన్‌కార్డులో నమోదై ఉన్న ప్రతి సభ్యుడూ ఈకేవైసీ చేయించాలన్న నిబంధన అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఎందుకీ ఈ -కేవైసీ
గ్రేటర్‌పరిధిలో డూప్లికేట్ కార్డులు, చనిపోయిన యూనిట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగానే ఈ కేవైసీ చేస్తున్నారు. అలాగే, ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్‌లో ఇబ్బందులు వస్తున్నాయని, ఆ సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కేవైసీ ఉపయోగపడుతుందంటున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆధార్‌తో ఈకేవైసీ లింక్ చేయడం వల్ల బినామీ పేర్లతోనూ బియ్యం తీసుకునే వారిని కట్టడి చేసే అవకాశం ఉంటుందంటున్నారు.
