రాష్ట్రంలో 5 వేల 473 గ్రామ పంచాయతీలకు సొంత భవనాల్లేవ్ !

రాష్ట్రంలో 5 వేల 473 గ్రామ పంచాయతీలకు సొంత భవనాల్లేవ్ !
  • శిథిల భవనాలు, అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, సర్కారు పాఠశాల వరండాల్లోనే విధులు
  • కొన్ని జీపీల్లో చెట్లు, వాటర్ ట్యాంక్  కింద నిర్వహణ
  • 7,287 పంచాయతీలకే శాశ్వత భవనాలు 
  • రికార్డులు ఉంచేందుకు అల్మారాలు కూడా లేవు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 5,473 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. దీంతో శిథిల భవనాలు, రేకుల షెడ్లు, అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, సర్కారు​ పాఠశాలల వరండాలు, అంగన్​వాడీ కేంద్రాల్లో సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల జీపీ భవనాలు ఉన్నా.. శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,760 పంచాయతీలు ఉండగా.. ఇటీవల కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో సొంత భవనాల్లేని జీపీల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో కొందరు చెట్ల కింద, వాటర్​ ట్యాంకులు, అద్దె గదులు, రేకుల షెడ్లు, పాఠశాల ఆవరణాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగించాల్సి వచ్చింది. వేల గ్రామాల్లో జీపీ కార్యాలయాలు లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి.

శిథిలావస్థలో 1,403 జీపీలు.. బిక్కుబిక్కుమంటూ విధులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం12,760 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో  5,473 పంచాయతీలకు సరైన భవనాలు లేవు. వీటిలో 4,070 చోట్ల అసలు భవనాలే లేకపోగా..1,403 భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో పంచాయతీ సిబ్బంది, సర్పంచులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా   7,287 పంచాయతీలకే పక్కా భవనాలు ఉండగా.. మిగిలినవన్నీ అద్దె భవనాలు, రేకుల షెడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, సర్కారు బడి వరండాల్లోనే సిబ్బంది విధులు కొనసాగుతున్నాయి.

వివిధ స్కీమ్లలో కొత్తగా జీపీ భవనాలు మంజూరైనా.. నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అలాగే, రికార్డులు భద్రపరుచుకునేందుకు అల్మారాలు కూడా లేవు, సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు లేవు. వర్షం వస్తే రికార్డులు తడిసి ముద్దవుతున్నాయి. గ్రామసభల నిర్వహణకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పంచాయతీ సిబ్బంది, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి శిథిలమైన వాటికి రిపేర్లు చేయాలని, సొంత భవనాలు లేని చోట కొత్తవి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

2,333 జీపీలు మంజూరైనా.. సాగని పనులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కీమ్​ల కింద కొత్తగా 2,333 భవనాలు మంజూరయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 190, ఆదిలాబాద్​ జిల్లాలో 169, నల్లగొండ  జిల్లాలో 118, మహుబూబాబాద్​లో  130, మంచిర్యాలలో 105, నాగర్​కర్నూల్​లో 104 పంచాయతీ భవనాలు, మిగిలిన జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో జీపీలు మంజూరయ్యాయి. నిధుల కొరత, బిల్లుల పెండింగ్  తదితర కారణాలతో పనులు ముందుకు సాగడం లేదు. వివిధ దశల్లో  పనులు నిలిచిపోయాయి. కాగా, జిల్లాల వారీగా చూస్తే.. నల్గొండ జిల్లా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 

ఈ జిల్లాలో 869 పంచాయతీలు ఉండగా.. అత్యధికంగా 387 జీపీలకు సొంతగూడు లేదు. ఇందులో 96 భవనాలు కూలిపోయే దశలో ఉండగా..  291 చోట్ల అసలు భవనాలే లేవు. వికారాబాద్  జిల్లాలో 594 జీపీలు ఉండగా.. 314 పంచాయతీలకు కార్యాలయాలు లేవు. కొత్తగా 82 జీపీలు మంజూరయ్యాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీలు ఉండగా.. 269 జీపీలకు ఆఫీసులు లేవు. మహబూబాబాద్​లో 482 జీపీల్లో 262 పంచాయతీలకు సొంతగూడు కరువైంది. 

ట్యాంక్  పిల్లర్లే గోడలు.. టార్పాలిన్లే కప్పు
కొమరం ఆసిఫాబాద్  జిల్లా తిర్యాణి మండలం రాజగూడ (గుండాల) పంచాయతీ ఆఫీసు దయనీయ స్థితిలో ఉంది. గిరిజన గూడెంలో పక్కా పంచాయతీ భవనం లేదు. దీంతో వాటర్ ట్యాంక్  కిందే ఆఫీసు నడుపుతున్నారు. సిబ్బంది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రికార్డులు పాడవకుండా చూస్తున్నారు. ట్యాంక్  పిల్లర్ల చుట్టూ టార్పాలిన్  కవర్లు కట్టి ఆఫీసుగా మార్చారు. పాలకులు మారుతున్నా.. ఈ ఆదివాసీ గూడెం రాత మాత్రం మారడం లేదు.

రేకుల డబ్బాలో జీపీ ఆఫీసు
ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామ పంచాయతీ ఆఫీసు! ఈ పంచాయతీ ఏర్పడి ఏడేండ్లవుతున్నా.. పక్కా భవనం లేదు. రేకుల డబ్బాలోనే పాలన సాగుతున్నది. ఇదే జిల్లాలోని  మునగాల మండలం  సీతానగరం, ఈదుల వాగు తండాల్లోనూ సొంత భవనాలు లేవు. 

రేకుల డబ్బాల్లో ఆఫీసులు.. కూలిపోతున్న గోడలు
మెదక్  జిల్లాలోని  నిజాంపేట్  మండలం ఖాసీంపూర్​లో గ్రామ పంచాయతీ ఇలా ఓ రేకుల డబ్బాలో నడుస్తోంది. ఎండకు ఉడికిపోతూ, వానకు తడుస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

అద్దె కట్టలేదని జీపీ ఆఫీస్​ ఖాళీ 
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీలో జీపీ ఏర్పాటై ఏడేండ్లయింది. అయినా పక్కా భవనం లేదు. ఇన్నాళ్లు అద్దె గదిలో ఆఫీసు నడిపారు. పంచా యతీకి ఫండ్స్ లేక అద్దె చెల్లించలేదని.. ఇంటి ఓనర్  ఆఫీసును ఖాళీ చేయించాడు. దీంతో సిబ్బంది ఫర్నిచర్, రికార్డులను తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్టు కింద పెట్టి రోజంతా అక్కడే విధు లు నిర్వహించారు. ఇదే మండలంలోని కొత్తగూ డెం తండాలోనూ రేకుల షెడ్లలోనే పాలన సాగుతోంది. ఇదే జిల్లాలోని  మునగాల మండ లం  సీతానగరం, ఈదుల వాగు తండా ల్లోనూ సొంత భవనాలు లేవు. ఇక్కడ అద్దె ఇళ్లలోనే అరకొర సౌకర్యాల మధ్య నెట్టుకొస్తున్నారు.