- ఆన్ లైన్లో క్లాసులు.. ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు
- యూజీసీ నిబంధనలపై అధికారుల తర్జనభర్జన
- టాప్ వర్సిటీలకే చాన్స్ ఉండటంతో ప్రత్యామ్నాయాలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: త్వరలో రాష్ట్రానికి ‘డిజిటల్ యూనివర్సిటీ’ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’తో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. ఇటీవల జరిగిన గ్లోబల్ సమిట్‌లో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఈ డిజిటల్ వర్సిటీ ద్వారా విద్యార్థులు కాలేజీకి వెళ్లాల్సిన పనిలేకుండా.. ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు వింటూ, డిగ్రీలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ఈ డిజిటల్ వర్సిటీ ద్వారా అందించనున్నారు.
ప్రాథమికంగా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో నిర్వహించి, డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
అడ్డంకిగా నిబంధనలు..
డిజిటల్ వర్సిటీ ఆలోచన బాగానే ఉన్నా.. దీనికి యూజీసీ నిబంధనలు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. న్యాక్ లో అత్యుత్తమ గ్రేడ్ ఉన్న టాప్ యూనివర్సిటీలకు మాత్రమే ఆన్‌లైన్ డిగ్రీలు, సర్టిఫికెట్లు ఇచ్చే అర్హత ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే వర్సిటీకి వెంటనే ఆ హోదా రాదు. దీంతో ఈ నిబంధనలను ఎలా అధిగమించాలనే దానిపై విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఫిజిక్స్ వాలా కేవలం టెక్నాలజీ పార్టనర్‌గా ఉంటుందా? లేక ఏదైనా ప్రభుత్వ యూనివర్సిటీ అనుబంధంగా ఈ కోర్సులను నడిపిస్తారా? అనే కోణంలో యూజీసీ గైడ్‌లైన్స్‌ను పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
