హాదీ హంతకుల్లో ఇద్దరు భారత్‎కు పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు

హాదీ హంతకుల్లో ఇద్దరు భారత్‎కు పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు

ఢాకా: స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హంతకులు ఇద్దరు భారత్‎కు పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. సరిహద్దులు దాటి మేఘాలయలో చొరబడ్డారని వెల్లడించారు. ఢాకా మెట్రోపాలిటన్ అదనపు  కమిషనర్ ఎస్ఎస్  నజ్రుల్  ఇస్లాం ఆదివారం మీడియాతో మాట్లాడారు. అనుమానితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్.. మైమిన్ సింగ్‎లో స్థానికుల సహకారంతో బంగ్లాదేశ్  నుంచి భారత్‏కు పారిపోయారని చెప్పారు. బంగ్లాదేశ్‎లోని హలువాఘాట్  సరిహద్దులను దాటి మేఘాలయలో చొరబడ్డారని పేర్కొన్నారు. 

‘‘బంగ్లా సరిహద్దులను దాటిన తర్వాత పుర్తి అనే వ్యక్తి ఫస్ట్ వారికి సాయం చేశాడు. తర్వాత సమి అనే ట్యాక్సీ డ్రైవర్.. ఫైసల్, ఆలంగిర్‎ను కారులో ఎక్కించుకుని మేఘాలయలోని తురా సిటీలో వదిలేశాడు. పుర్తి, సమిని ఇండియన్  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాకు సమాచారం ఉంది” అని ఇస్లాం పేర్కొన్నారు. హాదీ హంతకులను అరెస్టు చేసి, తిరిగి బంగ్లాదేశ్‎కు అప్పగించే విషయంలో సహకరించాలని ఆయన కోరారు. ఈ విషయమై భారత అధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించారు.

బంగ్లా పోలీసుల వ్యాఖ్యల్లో నిజం లేదు: బీఎస్ఎఫ్

హాదీ హంతకులు ఫైసల్, ఆలంగిర్ భారత్​లో చొరబడ్డారన్న బంగ్లాదేశ్  పోలీసుల వ్యాఖ్యలను మేఘాలయ, బీఎస్ఎఫ్  పోలీసులు తోసిపుచ్చారు. వారు భారత్‎లో చొరబడ్డారని చెప్పడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని బీఎస్ఎఫ్ ఐజీ  ఓపీ ఉపాధ్యాయ తెలిపారు.