కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి

కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు ..  పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్​కు ముందు  కల్వకుంట్ల తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టుకోవాలని పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్  జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంట్  లేదని కేసీఆర్  బాధపడడం లేదని, పొలిటికల్  పవర్ లేదనేదే ఆయన బాధ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు ప్రజలు పొలిటికల్  పవర్  లేకుండా చేశారని, దాంతో గత్యంతరం లేక బస్సుయాత్ర, పొలంబాట పేరుతో ఆయన పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  నివాసంలో కేసీఆర్  భోజనం చేసేటప్పుడు మూడుసార్లు కరెంట్  పోయిందని అంటే.. దీనిపై అధికారులు విచారణ జరిపి కరెంట్  పోలేదని వివరణ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్  గురి అంతా సీఎం పదవిపైనే ఉండేదని, రాష్ట్రం విడిపోతే సీఎం కావాలనుకునే వారన్నారు. అబద్ధాలను నిజాలుగా  ప్రజలకు ఎలా చెప్పాలో కేసీఆర్​కు బాగా తెలుసన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్​కు ప్రజలు గుర్తుకు రాలేదని, ప్రతిపక్షంలోకి రాగానే నిత్యం ప్రజల సమస్యలే ఆయనకు గుర్తుకువస్తున్నాయని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. పదేండ్లలో కేసీఆర్  ఒక్కసారైనా సెక్రటేరియెట్​కు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలోకి రాగానే ట్విటర్ లో అకౌంట్  ఓపెన్  చేసి ప్రజల సమస్యలపై తప్పుడు సమాచారంతో ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నాగార్జున రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు.