ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్​

ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు:  జైరాం రమేష్​

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిశాక బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు స్పష్టత వచ్చిందని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్  అన్నారు. ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ విద్వేష వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ట్విటర్​లో విమర్శించారు. మోదీ కర్నాటకలో ప్రచారం చేయనున్న సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు వేశారు.

 ‘‘పార్లమెంటులో ఎంపీల సగటు హాజరు శాతం 79 ఉంటే, కర్నాటక ఎంపీల హాజరు శాతం 71 మాత్రమే ఉందని పార్లమెంటరీ రిసెర్చ్  సర్వీస్  (పీఆర్ఎస్) నివేదిక తెలిపింది. ప్రజా ప్రతినిధులుగా బీజేపీ ఎంపీల పనితీరు ఎందుకు అధ్వానంగా ఉంది? 26 మంది కర్నాటక ఎంపీలు ఎన్నడూ ప్రజా సమస్యలపై మాట్లాడలేదని పీఆర్ఎస్  నివేదిక వెల్లడించింది. 

ఏడు నెలల ఆలస్యం తర్వాత కేంద్రం కరువు నిధుల్లో 20 శాతం కన్నా తక్కువే ఎందుకు విడుదల చేసింది? అప్పర్ భద్ర, మహదాయి ప్రాజెక్టులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కర్నాటకపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుంటే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎక్కడ దాక్కున్నారు?” అని జైరాం రమేష్​ ప్రశ్నించారు. కర్నాటక బీజేపీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కర్నాకట ప్రజలను వారు తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. ముగ్గురు ఎంపీలు ఐదేండ్లలో ఒక్క ప్రశ్న కూడా వేయలేదని, ఐదుగురు ఎంపీలు ఒక్క డిబేట్ లో కూడా పాల్గొనలేదని ఆయన విమర్శించారు.