మల్కాజిగిరి–కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్

మల్కాజిగిరి–కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్
  • పనితీరును తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్

హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి, కామారెడ్డి రైల్వే మార్గంలో 'కవచ్' రక్షణ వ్యవస్థను రైల్వే శాఖ మరింత ఆధునీకరించింది.  కవచ్ వెర్షన్ 3.2 ను వెర్షన్ 4.0 కి అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసే పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. ఒక ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ కవచ్ 4.0 పనితీరును తనిఖీ చేశారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ మురళీ కృష్ణ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా మల్కాజిగిరి, కామారెడ్డి మార్గంలో 108 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ అత్యాధునిక వెర్షన్‌‌‌‌‌‌‌‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

మెరుగైన భద్రతా ప్రమాణాలు, లొకేషన్ , పెద్ద యార్డుల్లో సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌పై స్పష్టమైన సమాచారం, ఆప్టికల్ ఫైబర్ ద్వారా స్టేషన్ల మధ్య అనుసంధానం వంటి  ఫీచర్లున్నాయి. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను, రైళ్లు ఎదురుముదురుగా ఢీకొనే ముప్పును, సిగ్నల్స్ దాటే పొరపాట్లను కవచ్ 4.0 వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెప్పారు.  పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలోనూ రైళ్ల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు ఎంతో సహాయపడుతుందని  తెలిపారు.