మంచిర్యాల, వెలుగు: అగ్రకుల అహంకారంతో దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానిస్తే తగిన బుద్ధి చెబుతామని మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సురిమల్ల వేణు, దళిత నాయకుడు కాశీ సతీశ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తన బర్త్‌డే వేడుకల సందర్భంగా ఎంపీ వంశీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాకా వెంకటస్వామి కుటుంబం దళిత కార్డుతో రాజకీయం చేస్తోందన్న కామెంట్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల నియోజకవర్గంలో తిరగకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌తో కాకా కుటుంబానికి ఐదు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఎంపీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి మేయర్ మధుకర్‌కు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణకు రాజకీయ భిక్ష పెట్టింది కాకా కుటుంబమేనని, నేడు దొర పంచన చేరి ఎంపీ వంశీకృష్ణపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని యూత్ లీడర్ అశోక్ తేజ వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య, దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
