- రిటైలర్లు భరించే అవకాశమే లేదు
- చార్జీలు రద్దు చేస్తేనే మేలు
- పరిశ్రమల సంఘాల స్పష్టీకరణ
- ఎండీఆర్‌కు వ్యతిరేకంగా సమ్మె చేసే ఆలోచన
న్యూఢిల్లీ: రూ.రెండు వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలకు 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ చార్జీని (ఎండీఆర్) వ్యాపారులు భరించే అవకాశమే లేదని, వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని రిటైల్ పరిశ్రమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు లావాదేవీల మాదిరిగా అదనపు చార్జీ వసూలు చేయడం లేదా నగదును అడిగే అవకాశం ఉంటుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఐఏ), ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ స్పష్టం చేశాయి.
అమ్మకాలపై వ్యాపారులకు గరిష్టంగా 2.5 శాతం వరకే నికర లాభం ఉంటోందని, అదనపు భారాన్ని భరించే పరిస్థితి లేదని తెలిపాయి. ఇది వరకే కొంతమంది దుకాణదారులు యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోబోమంటూ బోర్డులు పెట్టారు. దుస్తులు, చెప్పులు, మొబైల్ ఫోన్లు, మందులు, ఎఫ్ఎంసీజీ రంగాలలో బిల్లుల విలువ రూ.2,000 దాటడం సాధారణం కాబట్టి ఎండీఆర్అనివార్యం.
ఎంఎస్ఎంఈలు ఇప్పటికే తక్కువ లాభాలు, ఎక్కువ నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్నాయి. క్రెడిట్ కార్డుతో డబ్బు కడితే చిన్న వ్యాపారులు అదనపు చార్జీ వేయడం మామూలేనని, ఇక నుంచి రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. వ్యాపారుల స్థూల లాభం 18 నుంచి 20 శాతం ఉన్నప్పటికీ నికర లాభం 2.25 శాతం వరకే ఉంటుందని, యజమాని జీతం లెక్కలోకి వస్తే చాలామందికి దక్కేది అత్యల్పమనేది వ్యాపార సంఘాల వాదన.
అమలు కష్టమే..
యూపీఐ చార్జీలను వ్యాపారులే భరించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా ఉండవచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు. తక్కువ లాభాలతో నెట్టుకొస్తున్న చిన్న వ్యాపారులు యూపీఐ అంగీకరించబోరని అంటున్నారు. చాలా మంది నగదు ఇవ్వాలని అడుగుతారని, తప్పనిసరి అయితే అదనపు చార్జీలు వసూలు చేస్తారని ఏఐసీపీడీఎఫ్ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ చెప్పారు.
నగదు నిర్వహణలోనూ భారీ ఖర్చు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఎండీఆర్‌ను రద్దు చేయాలని కోరారు. మొబైల్ రిటైలర్లకు అమ్మకాలపై గరిష్టంగా1.5 శాతం లాభం వస్తోందని , వీళ్లు యూపీఐ చార్జీలను ఎలా భరిస్తారని ఏఐఎంఆర్‌ఏ చైర్మన్ కైలాష్ లఖ్యానీ ప్రశ్నించారు. జనరల్ ట్రేడ్ రిటైలర్లు ఈ ఖర్చును ఏదో ఒక రూపంలో వినియోగదారులపైకి నెట్టడం లేదా డిస్కౌంట్లు తగ్గిస్తారని, మొబైల్ రిటైలర్లకు ఈ అవకాశం లేదని చెప్పారు.
రైల్వే, మొబైల్ బిల్లులు, ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఐదు రూపాయల ఫిక్స్డ్చార్జీ మాదిరే యూపీఐ లావాదేవీలపైనా నామమాత్రపు స్థిర రుసుము ఉంటే బాగుంటుందని వ్యాపార సంఘాలు అంటున్నాయి. ఎండీఆర్రద్దు కోసం కేంద్రానికి లేఖ రాస్తామని, స్పందన రాకుంటే టోకెన్ సమ్మె చేస్తామని చెబుతున్నాయి.
