- అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదని కవిత విమర్శలు
- ఓల్డ్ సిటీలో ‘జనం బాట’ పర్యటన
ఓల్డ్‌సిటీ/మలక్‌పేట, వెలుగు: ప్రభుత్వాలు మారినా పాతబస్తీ ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదని, నిజాం కాలం నాటి సదుపాయాలు తప్ప ఇంకేం అభివృద్ధి లేక సమస్యలతో జీవిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. చార్మినార్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి మూడేళ్ల కింద శంకుస్థాపన చేయగా, ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జాగృతి ‘జనం బాట’లో భాగంగా గురువారం ఓల్డ్ సిటీలోని యాకుత్ పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్ నియోజకవర్గాల్లోని బస్తీలు, మురికివాడలు, దుకాణ సముదాయాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు వేల కోట్లతో పాతబస్తీ, చార్మినార్ అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
లాల్ దర్వాజ ఆలయ విస్తరణ ఇంకెప్పుడు
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాల్ దర్వాజా ఆలయ విస్తరణకు రూ.10 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయ విస్తరణ కోసం నిధులు రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారన్నారు. అయితే నేటికీ నిధులు విడుదల కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణలో ఇండ్లను కోల్పోతున్న ఐదుగురు బాధితులకు వెంటనే చెక్కులు పంపిణీ చేసి, అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
మలక్‌పేట గంజ్ మార్కెట్ లో శానిటేషన్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత అన్నారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన సాగుతున్నదని విమర్శించారు. ఖాజాబాగ్, చింతల బస్తీల్లో 15 వేల కుటుంబాలు 40 ఏండ్లుగా నివసిస్తున్నా, వారి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు.

