ఒవైసీ బ్రదర్స్..అధికారం చుట్టూ తిరిగే సన్ఫ్లవర్స్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఒవైసీ బ్రదర్స్..అధికారం చుట్టూ తిరిగే సన్ఫ్లవర్స్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  • రాయల తెలంగాణ అని.. రాష్ట్రం వచ్చాక కేసీఆర్​తో కలిసిన్రు: కవిత
  •     ఇప్పుడు కాంగ్రెస్​తో జట్టు కట్టారు
  •     వాళ్లను రాహుల్​ వ్యతిరేకిస్తే.. రేవంత్​ దోస్తానా చేస్తుండు
  •     ‘మున్సిపల్ ​బూతుల వర్షం’ ముగిసి చెవులకు హాయిగా ఉంది
  •     అన్ని పార్టీలూ సమస్యలను వదిలి బూతులే మాట్లాడాయని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఒవైసీ బ్రదర్స్​ అధికారం చుట్టూ తిరిగే సన్​ఫ్లవర్స్​అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో రాయల తెలంగాణ అని.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్​తో కలిసి అధికారంలో పాలుపంచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్​తో జట్టు కట్టారన్నారు. అలాగే, ఒవైసీ బ్రదర్స్​ను రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే.. ఇక్కడ సీఎం మాత్రం వారితో దోస్తానా చేస్తున్నారని విమర్శించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒవైసీ బ్రదర్స్ అభ్యర్థినే కాంగ్రెస్ నిలబెట్టిందన్నారు. ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధే జరగడం లేదని, ఆ అభివృద్ధి కోసం ఒవైసీ బ్రదర్స్​ ఓల్డ్​ సిటీలో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఆమె హైదరాబాద్​లో జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో​బూతుల వర్షం కురిసిందని కవిత విమర్శించారు. 

ప్రచార సమయం ముగిసినప్పటి నుంచి చెవులకు హాయిగా ఉందని అన్నారు. వడగండ్ల వాన ముగిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. బూతుల వాన ఆగిన తర్వాత అంత ప్రశాంతంగా ఉందన్నారు. అన్ని పార్టీలు సమస్యలను పక్కనపెట్టి.. పోటీ పడి మరీ బూతులే మాట్లాడాయన్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సర్పంచ్​ఎన్నికల్లాగే.. మున్సిపల్​ఎన్నికలు కూడా పార్టీ గుర్తులేకుండా జరిగితే బాగుంటుందన్నారు. వ్యక్తులను తిట్టడానికి మాత్రమే మున్సిపల్​ ఎన్నికల ప్రచారం పరిమితమైందని, జిల్లాలు, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన సమస్యలపై ఎవరూ మాట్లాడలేదని అన్నారు. 

‘‘మహబూబ్​నగర్​లో బీజేపీ జాతీయాధ్యక్షుడు వచ్చి ప్రచారం చేశారు. దురదృష్టం ఏమిటంటే మహబూబ్ నగర్ లో ఇప్పటికీ రెండు రోజులకు ఒక్కసారే నీళ్లొస్తున్నాయి. గతంలో సిటీలో రెండు సిటీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు మచ్చుకైనా లేవు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను చూస్తుంటే పిల్లలు తక్కువ.. పంతుళ్లు ఎక్కువ అనే పరిస్థితి ఏర్పడింది. బస్తీ దవాఖాన్లలో గోలీలు లేవు.. డాక్టర్లు లేరు. రోడ్లు, డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోతోంది. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్.. బీజేపీతో కలిసిపోయి కాంగ్రెస్​తో సీట్లు సర్దుబాటు చేసుకుంది

ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిశాయని, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్​ కూడా సీట్లు సర్దుబాటు చేసుకున్నాయని కవిత ఆరోపించారు. ప్రజలు చూసి ఓట్లేయాలని, సింహం గుర్తుపై పోటీ చేస్తున్న జాగృతి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలుంటే ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ వచ్చిందన్నారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క స్నేహం వల్ల సిద్దిపేటకు మాత్రమే మంజూరు చేశారన్నారు. బీఆర్​ఎస్​ ఉన్నా.. కాంగ్రెస్​ ఉన్నా.. గుంట నక్కకే పనులు అవుతున్నాయన్నారు. ఈసారి బడ్జెట్​లో సంక్షేమానికి పెద్దపీట వేయాల న్నారు. 

గత బడ్జెట్​లో పింఛన్లకు రూ.1.21 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టి.. కేవలం రూ.55 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్లకు రూ.36 వేల కోట్ల బిల్లులు చెల్లించాలని టార్గెట్​ పెట్టుకుని.. రూ.42 వేల కోట్లు ఇచ్చారన్నారు. కమీషన్లు ఎక్కువ వచ్చే పనులకే డబ్బులు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ బడ్జెట్​లో బీసీలకు రూ.20 వేల కోట్లు పెట్టాలన్నారు. 

రైతు రుణమాఫీ వంద శాతం చేశామని సీఎం అంటున్నారని, రైతులకు రూ.44 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.28 వేల కోట్లే అని తర్వాత మాట మార్చారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉండేవారని.. కానీ, గత పదేండ్ల బీఆర్​ఎస్​ పాలన, రెండేండ్ల కాంగ్రెస్​ పాలనలో కార్మికులను 32 వేలకు తగ్గించారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.