ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి: కవిత

ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి: కవిత
  • ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ ​చేశారు. గత ప్రభుత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణనలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు తేలిందని, ఆ మేరకు రిజర్వేషన్లను ఇవ్వాలని పేర్కొన్నారు.

సోమవారం బంజారాహిల్స్​లోని తెలంగాణ జాగృతి ఆఫీసులో ఎస్సీ ఉప కులాల నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. పెరిగిన ఎస్సీల జనాభాకు తగ్గట్టుగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని, అందుకు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘జనగణన పూర్తయి.. అధికారిక లెక్కలు వచ్చాక ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టుగా రిజర్వేషన్లను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాబట్టి, దానిపై అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి. ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఉప కులాలతో కలిసి రిజర్వేషన్ల పెంపు సహా కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’’ అని కవిత పేర్కొన్నారు.