హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల పోరాటంతోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్చేస్తే సరిపోదని.. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థాగత సంస్కరణల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ శనివారం ట్వీట్ చేశారు.
యూపీఎస్సీ తరహాలోనే ఎన్టీఏకి కూడా చట్టబద్ధమైన స్వతంత్రత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ఈ నెల 20న విద్యార్థులపై పాశవికంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు న్యాయం జరిగినట్లని కవిత పేర్కొన్నారు.
