చేవెళ్ల బస్సు ప్రమాద కుటుంబాలకు కోటి పరిహారమియ్యాలి : జాగృతి అధ్యక్షురాలు కవిత

చేవెళ్ల బస్సు ప్రమాద కుటుంబాలకు  కోటి పరిహారమియ్యాలి : జాగృతి అధ్యక్షురాలు కవిత
  • గాయపడిన వారికి 10 లక్షల చెల్లించాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​చేశారు. గాయపడిన వారికి రూ.10 లక్షలు చెల్లించాలన్నారు. ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను పోగొట్టుకున్న ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని శుక్రవారం వికారాబాద్ జిల్లా పేర్కంపల్లిలో కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రమాదం డ్రైవర్ల తప్పిదం వల్ల జరగలేదని.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆమె ఆరోపించారు. రోడ్డు మంజూరై.. ఎన్జీటీలో పరిష్కారం లభించినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లే తప్పు జరిగిందన్నారు.

 బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన తరువాత రోడ్డు పనులు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఇదే పని వారం ముందు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టిసారించాలని ఆమె అన్నారు. ఆమె వెంట తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, జాగృతి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు తదితరులు ఉన్నారు.