మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నరు

మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నరు

న్యూఢిల్లీ, వెలుగు: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  కేసీఆర్ ఫ్యామిలీ అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని  ఆయన విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కమిటీ 2014 నవంబర్ లో నివేదిక అందించిందని,  ఇదంతా రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోపే జరిగిందని తెలిపారు. కమిటీ నివేదికలో వెల్లడించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పలుమార్లు చెప్పాయని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి 2018 మార్చి 7న రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఆ తర్వాత పార్లమెంటులోనూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు తమ ప్రభుత్వం ఇదే సమాధానం చెప్పిందని తెలిపారు.

‘‘2018 లో తెలంగాణ ప్రభుత్వం కూడా మంత్రులు కేటీఆర్, జగదీశ్​ రెడ్డితో కూడిన ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా బయ్యారంలో లభించే ఐరన్ ఓర్ నాణ్యమైనది కాదని చెప్పింది. ఇంత జరిగినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్ నేతలు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నరు. రాష్ట్రం దీనమైన పరిస్థితిలో ఉంటే, సీఎం సొంత లాభం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నరు. ముందు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను పూర్తి చేసి, తర్వాత జాతీయ పార్టీ ఆలోచన చేస్తే బాగుంటుంది” అని కిషన్​రెడ్డి సూచించారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం మానేసి, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని కట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం ఫ్యాక్టరీపై ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు.