నీళ్ల దోపిడీని కేసీఆర్ అడ్డుకోలే : మహేశ్వర్ రెడ్డి

నీళ్ల దోపిడీని కేసీఆర్ అడ్డుకోలే : మహేశ్వర్ రెడ్డి
  •      ఇరిగేషన్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలె 

హైదరాబాద్, వెలుగు :  ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని రాష్ర్ట ప్రభుత్వం ఆరోపిస్తుందని, ఇది తేలాలంటే రాష్ట్రం ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ కృష్ణా జలాలపై జరిగిన చర్చలో మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ మాట్లాడారు. సీబీఐ ఎంక్వైరీ అడిగిన సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

 కృష్ణా నీటి విషయంలో గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాయని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఎందుకు సంతకం చేశారని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ కోసం, మేఘా కృష్ణా రెడ్డికి కాంట్రాక్టుల కోసం కేసీఆర్ రాష్ట్ర  ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. 

అసెంబ్లీలో అబద్ధాలు :  పాయల్ శంకర్

పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సభలో కేఆర్ఎంబీపై చర్చ పేరుతో కొత్త నాటకానికి తెరతీశాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు మేలుచేసే నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. 

కొత్తగా వెళ్లి చూడాల్సింది ఏం లేదు :  రాకేశ్ రెడ్డి

సూట్ కేసుల్లో తేడాలు వచ్చే మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం వెళ్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ టూర్​కు బీజేపీ వెళ్లటం లేదని సోమవారం చిట్ చాట్ లో ఆయన తెలిపారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సిందేమీ లేదని చెప్పారు.