కేసీఆర్​ కుటుంబం తెలంగాణను కబ్జా చేసింది

కేసీఆర్​ కుటుంబం తెలంగాణను కబ్జా చేసింది
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

హైదరాబాద్​, వెలుగు: మాయావతి నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ  బీఎస్పీ చేరువైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. ‘‘మొట్టమొదటిసారిగా హైదరాబాద్​ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ దావా వేస్తున్నది. కేసీఆర్​.. దమ్ముంటే దానిని ఆపు’’ అని సవాల్​ విసి రారు. రజాకార్లు, గడీల పాలనపై పోరాడిన గడ్డ.. రైతాంగ సాయుధ పోరాట గడ్డ.. తెలంగాణ అని అన్నారు. ‘‘అలాంటి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు, బాధలే ఉన్నయ్​. మా సీఎం ఎవరో ఇంత వరకు చూడలేదు.. మా మంత్రులెవరో చూడలేదు.. మా ఎమ్మెల్యే ఎవరో చూడలేదు అని చా లా మంది నా పాదయాత్రలో నాతో చెప్పుకున్నరు. అమరువీరుల పోరాటంతో వచ్చిన తెలంగాణను కేవలం ఒక్క కుటుంబానికే పరిమితం చేసుకున్నరు. ఆ కుటుంబమే తెలంగాణను కబ్జా చేసింది. భూములు, రోడ్లను కబ్జా పెట్టారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, కుంభకోణాలే ఉన్నాయి’’ అని మండిపడ్డారు.

ఆదివారం సరూర్​నగర్​లో జరిగిన ‘తెలంగాణ భరోసా’ సభలో ప్రవీణ్​కుమార్​ మాట్లాడారు. బీఎస్పీ భయంతోనే నగరం నడిబొడ్డున నిలువెత్తు అంబేద్కర్​ విగ్రహాన్ని కేసీఆర్​ పెట్టారని అన్నారు. ‘‘ఏనాడూ అంబేద్కర్​ జయంతి నాడు ఆయన విగ్రహానికి దండ వేయని సీఎం.. ప్రగతి భవన్​ నుంచి బయటకు రాని సీఎం.. ప్రగతిభవన్​లో అంబేద్కర్​ విగ్రహం పెట్టని సీఎం..  రాజ్యాంగాన్ని మారుస్తానన్న సీఎం.. బీఎస్పీ దెబ్బకు బేహోష్​ అయ్యిండు. అందుకే ఆగమేఘాల మీద సెక్రటేరియెట్​కు అంబేద్కర్​ పేరు, ఆ పక్కనే అంబేద్కర్​ విగ్రహం పెట్టిండు. పేరుకే వాటిని పెట్టినా.. ఒక దళిత ఆడబిడ్డ చీఫ్​ సెక్రటరీ కాకుండా అడ్డుకున్నడు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దళితబంధులో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ప్రతి ఎమ్మెల్యే రూ.3 లక్షల కమీషన్​ తీసుకున్నరని స్వయానా సీఎం చెప్పిండు. కేసీఆర్​కు దమ్ముంటే వారి చిట్టాను ఏసీబీకి ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్​ చేశారు. 

ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలు

రైతులకు కేసీఆర్​ ఒరగబెట్టిందేమీ లేదని ప్రవీణ్​ కుమార్​ ఫైరయ్యారు. ‘‘అకాల వర్షాలతో రైతులు నష్టపోతే.. కేసీఆర్​ ప్రగతి భవన్​లో మహారాష్ట్ర వ్యక్తికి ఏడాదికి రూ.18 లక్షల జీతంతో ప్రైవేటు సెక్ర టరీ ఉద్యోగమిచ్చిండు. ప్రగతి భవన్​ నుంచి ఫామ్​హౌస్​కు.. ఫామ్​హౌస్​ నుంచి ప్రగతి భవన్​కు వచ్చిపో వడానికే కేసీఆర్​ రూ.79 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నడు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో దొడ్డిదారిన రూ.10 లక్షల నుంచి రూ.కోటికి  ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలు ఈ బీఆర్​ఎస్​ నేతలు’’ అని ఫైర్​ అయ్యారు. పచ్చగా ఉన్న తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించాలని బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

నిజాలు చెప్పే మీడియాపై ఆంక్షలేంది?

నిజాలు చెప్పే.. నిజాలు చూపించే పత్రికలు, మీడియాను సెక్రటేరియెట్​లో అడుగుపెట్టనివ్వట్లేదని సీఎం కేసీఆర్​పై ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ మండిపడ్డారు. వాటికి అడ్వర్టైజ్​మెంట్లు ఇవ్వొద్దంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ‘‘నెలకు కేవలం రూ.20 వేల జీతం తీసుకునే ఆర్టిజన్​ కార్మికులు తమ డిమాండ్ల కోసం కొట్లాడుతుంటే ఎస్మా ప్రయోగించిన్రు. కానీ, నెలకు రూ.4.25 లక్షల జీతాన్ని ఫస్ట్​ తారీఖు నాడే సీఎం తీసుకుంటున్నడు. పోలీసులకు మాత్రం 13న ఇస్తున్నడు. మరి ఎవరి మీద ఎస్మా పెట్టాలె? ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు కావాల్నా?’’ అని ప్రవీణ్​ కుమార్​ ప్రశ్నించారు. ‘‘సరూర్​నగర్​ సభ.. దొరల గడీల్లో ఉన్న పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది” అని బీఎస్పీ స్పోక్స్​పర్సన్​ వెంకటేశ్​ చౌహాన్​ అన్నారు.