
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ 8 ఏండ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకూ బయల్దేరుతున్నరని ఆయన ఫైర్ అయ్యారు. సోమవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పెట్టి, దేశ్ కీ నేత అవుతడట అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం వరల్డ్ పీస్ ర్యాలీ జరిగితే కేసీఆర్ రాలేదు. 2 వారాలుగా ఈ మీటింగ్ జరగొద్దని కేటీఆర్ అడ్డుకున్నారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు” అని ఆయన ఆరోపించారు. పీస్ ర్యాలీకి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు మద్దతు పలికారన్నారు.
కేసీఆర్ను ఇన్వైట్ చేద్దామంటే అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. పీస్ ర్యాలీ విషయంలో తనకు కోదండరాం, జేడీ లక్ష్మీనారాయణ, గద్దర్, విమలక్క, జస్టిస్ చంద్రకుమార్ మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఎకనామిక్ సమిట్ ఏర్పాటు చేస్తున్నట్లు పాల్ తెలిపారు. దీనిని కూడా కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. పీస్ ర్యాలీని, ఎకనామిక్ సమిట్ ను కేసీఆర్, కేటీఆర్ అడ్డుకోవడానికి వ్యతిరేకంగా పాల్ తన పార్టీ ఆఫీసులో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.