వీ6, వెలుగుపై అదే కుట్ర.. వరుసగా మూడో అధికారిక ప్రోగ్రామ్​కు రానివ్వని రాష్ట్ర సర్కార్

వీ6, వెలుగుపై  అదే కుట్ర.. వరుసగా మూడో  అధికారిక ప్రోగ్రామ్​కు రానివ్వని రాష్ట్ర సర్కార్
  • నిమ్స్​ కొత్త బిల్డింగ్​ భూమి పూజలో నిషేధాజ్ఞలు
  • పాస్​లు ఇష్యూ చేసే జాబితాలో వీ6, వెలుగు పేర్లు తొలగించిన సీఎంవో
  • విజిటర్లుగా కూడా లోపలికి రానివ్వని అధికారులు

హైదరాబాద్, వెలుగు:  వీ6, వెలుగు మీడియాపై కేసీఆర్​ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రజల సొమ్ముతో చేపట్టే అధికారిక కార్యక్రమాలకు కూడా అనుమతించడం లేదు. కొత్త సెక్రటేరియెట్​ప్రారంభోత్సవం నుంచి తెలంగాణ మీడియా సంస్థలపై నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నది. బీఆర్ఎస్​ పార్టీ కార్యక్రమాలకు వీ6, వెలుగు ప్రతినిధులను రాకుండా బ్యాన్​ చేస్తామని తెలంగాణ భవన్ ​వేదికగా కేటీఆర్ అప్పట్లో ​ప్రకటించగా.. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర సర్కారు కూడా పాటిస్తున్నది. 

నిమ్స్​ కొత్త బిల్డింగ్  నిర్మాణానికి సీఎం కేసీఆర్​ బుధవారం భూమి పూజ చేయగా.. దీని కవరేజీ కోసం మంగళవారం రాత్రే అన్ని మీడియా సంస్థలకు పాస్​లు పంపారు. ఐ అండ్​ పీఆర్​ అధికారులే స్వయంగా వెళ్లి ఇష్యూ చేసి వచ్చారు. వీ6 చానల్​, వెలుగు దినపత్రిక ప్రతినిధులకు మాత్రం కవరేజీ పాస్​లు ఇవ్వలేదు. నిమ్స్​లోనే పాస్​లు ఇస్తున్నారని చెప్తే.. అక్కడికి వెళ్లగా పాస్​లు ఇచ్చేందుకు నిరాకరించారు. 

పాస్​లు ఇష్యూ చేసే లిస్టులో వీ6, వెలుగు మీడియా ప్రతినిధుల పేర్లను సీఎంవో అధికారులు రౌండప్​చేశారని, అందుకే తాము పాస్​లు ఇవ్వలేమని ఐ అండ్​పీఆర్​ఆఫీసర్లు చెప్పారు. పాస్​ల విషయంలో తాము చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. స్వరాష్ట్రంలో పాలకుల తీరు రాజరికపు వ్యవస్థను యాదికితెస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అంటే తమ ఇలాఖా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలుగెత్తి చాటినందుకు అప్పట్లో సమైక్య పాలకులు కూడా ఇట్లనే వీ6పై నిషేధాజ్ఞలకు అమలు చేశారు. ఇప్పుడు కూడా జనం తరఫున నిలబడి వారి సమస్యలను చెప్తున్నందుకు బీఆర్​ఎస్​ సర్కార్​ అనధికారికంగా ఆంక్షలు అమలు చేస్తున్నది.  

ఇదేమన్నా రాజరికమా?

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన వీ6 చానల్.. ఉద్యమంలో ముందుండి పోరాడింది.  సమైక్య పాలకులు ఎంతగా అణచి వేయాలని చూసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఎత్తిన తెలంగాణ జెండాను దించకుండా ఉద్యమ పంథా కొనసాగించింది. ఇప్పటి పాలకులే.. ఉద్యమ నాయకులుగా అప్పట్లో వీ6 చానెల్​ను కీర్తించారు. అప్పుడు ఉద్యమంలో, ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రజల గొంతుకగా తెలంగాణ మీడియా సంస్థ వీ6 పనిచేస్తున్నది. ఇదే స్ఫూర్తితో వచ్చిన వెలుగు దినపత్రిక కూడా ఎప్పటికప్పుడు జనం సమస్యలను పాలకుల ముందు ఉంచుతున్నది. ఇది నచ్చక స్వరాష్ట్రంలోనూ సమైక్య పాలకుల తీరుగానే తెలంగాణ మీడియా సంస్థపై  ఆంక్షలు అమలు చేస్తున్నారు.  

బీఆర్​ఎస్​  కార్యక్రమాలకు వీ6, వెలుగును రానివ్వొద్దని పార్టీ కేడర్​ను ఆ మధ్య మంత్రి కేటీఆర్ ​ఆదేశించగా.. కొన్ని రోజుల కింద ఎమ్మెల్సీ కవిత కూడా తన అక్కసు వెళ్లగక్కారు. నిజామాబాద్​లో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘వీ6 చూడొద్దు.. వెలుగు చదవొద్దు.. వాటికి మీరెందుకు యాడ్స్​ ఇస్తున్నరు’’ అంటూ బీఆర్​ఎస్​ లీడర్లపై గరమయ్యారు.  ప్రజలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నదని హెచ్చరిస్తే.. మన నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్ల పాలవుతున్నాయని చెప్తే.. 

ఉద్యోగాలు రాక మన యువత ఊపిరి తీసుకుంటున్నారని ఎరుక చేస్తే.. ప్రజలకు వ్యతిరేకంగా రాసినట్టా? బీఆర్​ఎస్​ లీడర్లకే తెలియాలి. బీఆర్​ఎస్​ కార్యక్రమాలకు రావ్వొద్దనడం అది ఆ పార్టీ సొంత విషయం కావొచ్చు.. కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ నిషేధాజ్ఞలు అమలు చేయడం ఏమిటి? ప్రజల సొమ్ముతో చేపట్టే గవర్నమెంట్​ ప్రోగ్రామ్స్​కు   అనుమతించకపోవడం రాజరిక వ్యవస్థను గుర్తుకు తెస్తున్నది.

మొన్న సెక్రటేరియెట్​లో..!

ఏప్రిల్ ​30న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ తెలంగాణ సెక్రటేరియెట్​ను సీఎం కేసీఆర్​ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కవరేజీ కోసం ప్రతినిధుల పేర్లు ఇవ్వాలని ముందస్తుగా ఐ అండ్​ పీఆర్​ అధికారులు అడిగారు. వీ6, వెలుగు పేర్లు ఇచ్చినా పాస్​లు మాత్రం జారీ చేయలేదు. ప్రభుత్వ పెద్దలే వద్దని చెప్పారని, తామేమీ చేయలేమని అధికారులు అన్నారు.  

అదే రోజు ఇతర రాష్ట్రాల నుంచి మీడియా ప్రతినిధులను ప్రత్యేక విమానాల్లో రప్పించి సెక్రటేరియట్​ లోపలికి రెడ్​కార్పెట్​పరిచి మరి తోడ్కెళ్లారు. జూన్​2న సెక్రటేరియట్​లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కవరేజీ పాస్​ల కోసం పేర్లు అడిగి.. తీరా సమయానికి వీ6, వెలుగుకు నో ఎంట్రీ అని చెప్పారు. బుధవారం నిమ్స్​కొత్త బిల్డింగ్​నిర్మాణం భూమి పూజకు అన్ని మీడియా సంస్థలకు పాస్​లు ఇచ్చి తెలంగాణ మీడియా సంస్థ వీ6, వెలుగును రాకుండా అడ్డుకున్నారు. కనీసం విజిటర్స్​గానైనా ఆ కార్యక్రమానికి వెళ్లనీయలేదు.