వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ కింద డెలివరీ అయిన మహిళలకు రూ.13 వేలు ఇవ్వకుండా.. రూ.వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకుంటోందని రాష్ట్ర వినియోగదారుల మండలి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‍కు ఫిర్యాదు చేసింది. మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, సీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ శనివారం ఢిల్లీలోని విజిలెన్స్ కమిషన్ ను కలిశారు. రెండు, మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్కింద ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన వారికి రూ.13 వేల ప్రోత్సాహక సాయం ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే టైంలో రూ.వందల కోట్లతో పేపర్లు, మీడియా, హోర్డింగుల ద్వారా పథకం అమలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఒక్క వరంగల్ సీకేఎం హాస్పిటల్లోనే 17,247 మందికి కేసీఆర్ కిట్ కింద రూ.13 వేల చొప్పున ఇవ్వాల్సి ఉందన్నారు. 2017–18 లో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన జననీ శిశు సురక్ష కార్యక్రమాలకు సంబంధించి రూ.1,14,70,135 ఫండ్స్ ఇతర అవసరాలకు వాడడంపై కూడా కంప్లయింట్ చేశారు. మూడేండ్ల క్రితం జరిగిన మందుల కుంభకోణంలో నామమాత్రపు చర్యలు తీసుకోవడంపై విచారణ చేపట్టాలని కోరారు.
