గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా..?

బీఆర్ఎస్​కు మరో బిగ్​షాక్​ తగిలింది. ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. పోచారం కొడుకు, నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితోపాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే  కాంగ్రెస్ లో చేరడం ఖాయమని దానం నాగేందర్ అన్నారు.

 శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘పోచారం ఒక్కరే కాదు, రాష్ట్రంలో, గ్రేటర్​లో ఇక బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయం’ అని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు మూడు  రోజులుగా చర్చించి, చేరికలపై ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. కేటీఆర్​, హరీశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు. 

హరీశ్​తోపాటు మరి కొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే ఎమ్మెల్యేల్లో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్​లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.