ఎంఐఎంకే ఎమ్మెల్సీ సీటు

ఎంఐఎంకే ఎమ్మెల్సీ సీటు

హైదరాబాద్,  వెలుగు: హైదరాబాద్​ లోకల్​ బాడీ ఎమ్మెల్సీ సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు కేసీఆర్ ​ఓకే చెప్పారు. తన పార్టీ బీఆర్​ఎస్​కు ఆ సీటును దక్కించుకునే మెజారిటీ ఓట్లు ఉన్నప్పటికీ మజ్లిస్​కే వదిలేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేస్తామని, కనీసం15 మంది ఎమ్మెల్యేలం గెలిచి వస్తామని అసెంబ్లీ వేదికగా అధికార బీఆర్ఎస్​ను ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరించినంత పని చేశారు. దీంతో బీఆర్ఎస్​తో ఎంఐఎం దోస్తీ ముగిసినట్టేనని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల సిగపట్లు తప్పవన్నట్టుగా ప్రచారం జరిగింది.

అసెంబ్లీ లాబీల్లోనూ.. వచ్చే ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేసి తీరుతామని అక్బర్​ కుండబద్ధలు కొట్టారు. అయితే.. ఆ మధ్య అసెంబ్లీలోని మంత్రి కేటీఆర్ ​చాంబర్​లో కేటీఆర్​ను ఎంఐఎం చీఫ్, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ కలిసి.. హైదరాబాద్ ​లోకల్ బాడీస్​ఎమ్మెల్సీ సీటుపై చర్చించారు. మిత్రధర్మంలో భాగంగా ఆ సీటును తమకే ఇచ్చేయాలని కోరారు. కేసీఆర్​కు ఇదే విషయం చెప్పి ఒప్పిస్తానని ఆ మీటింగ్​లో కేటీఆర్ ​హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అసద్​తో చర్చల సారాంశాన్ని మంత్రి కేటీఆర్​ బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్ ​దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో  ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ ​దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి ఇప్పుడు ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్ హసన్​ జాఫ్రీకే మరోసారి చాన్స్​ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.  ఒకటి, రెండు రోజుల్లో ఆయన నామినేషన్​ వేస్తారని సమాచారం. ఒకవేళ ఇతర పార్టీలు నామినేషన్​ వేస్తే.. మార్చి 13న పోలింగ్​ నిర్వహించి, 16న ఓట్లు లెక్కిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పదవీకాలం మే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుంది.