భారతీయ చిత్ర పరిశ్రమలో 'పాన్-ఇండియా' అనే పదం ప్రస్తుతం ఒక ట్రెండ్. కానీ, మూడు దశాబ్దాల క్రితమే, రాజమౌళి వంటి దర్శకులు ఇంకా అరంగేట్రం చేయకముందే, ఒకే సినిమాను వేర్వేరు భాషల అగ్ర హీరోలతో నిర్మించి సంచలనం సృష్టించారు కన్నడ క్రేజీ స్టార్ వి. రవిచంద్రన్. ఆ ప్రయోగాత్మక చిత్రమే 'శాంతి క్రాంతి' (1991). భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఒక సంచలనం.
ఒకే పాత్ర.. ముగ్గురు సూపర్ స్టార్లు!
అవయవ మార్పిడి మాఫియా నేపథ్యంలో.. అభం శుభం తెలియని పిల్లలను రక్షించే పోలీస్ ఆఫీసర్ కథతో ఈ చిత్రం రూపొందింది. రవిచంద్రన్ దీనిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే.. కన్నడ వెర్షన్‌లో తనే హీరోగా నటిస్తూనే, తెలుగులో అక్కినేని నాగార్జునను, తమిళం, హిందీ భాషల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ను కథానాయకులుగా ఎంచుకున్నారు. ఈ సినిమా అన్ని వెర్షన్లలోనూ జూహీ చావ్లా, ఖుష్బూ నటించడం విశేషం. రజనీకాంత్ తొలుత నిరాకరించినప్పటికీ, కథలోని సామాజిక సందేశం నచ్చి చివరకు అంగీకరించారు.
Also Read : ఫ్యామిలీతో రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్
హాలీవుడ్ రేంజ్ మేకింగ్.!
1988లో జవహర్‌లాల్ నెహ్రూ శతజయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోసం అప్పట్లోనే రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఇదే భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రం. బెంగళూరులోని ఎం.జి. రోడ్డును సెట్ రూపంలో పునర్నిర్మించడం నుండి, ప్రతి భాషా వెర్షన్ కోసం విడివిడిగా కార్లు, క్రూ మెంబర్స్, క్యాటరింగ్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడం వరకు రవిచంద్రన్ ఎక్కడా తగ్గలేదు. సెట్‌లో సిబ్బంది హోటల్ సర్వర్లలా గ్లౌజులు వేసుకుని తిరిగేవారంటే మేకింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయం అంచనా తప్పిన వేళ..
మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 1991 సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదలైంది. భారీ బడ్జెట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ. 8 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. నాగార్జున, రజనీకాంత్ వంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ, విమర్శకుల నుండి వచ్చిన మిశ్రమ స్పందన, భారీ వ్యయం వల్ల ఆర్థికంగా ఈ సినిమా 'డిజాస్టర్'గా మిగిలిపోయింది. రవిచంద్రన్ తండ్రి, దిగ్గజ నిర్మాత వీరాస్వామి అనారోగ్యంతో ఉన్న సమయంలో వచ్చిన ఈ పరాజయం రవిచంద్రన్‌ను ఆర్థికంగా దివాళా తీయించింది. అప్పులు తీర్చడానికి ఆయన తర్వాత కాలంలో వరుసగా చిన్న సినిమాలు చేయాల్సి వచ్చింది.
దశాబ్దాల తర్వాత రజనీ-నాగ్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 'శాంతి క్రాంతి' తర్వాత నాగార్జున, రజనీకాంత్ మళ్ళీ కలిసి కనిపించడానికి 30 ఏళ్లకు పైగా సమయం పట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' చిత్రంలో వీరిద్దరూ తలపడ్డారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డులు సృష్టించింది. అయితే కాలం గడిచినా, 'శాంతి క్రాంతి' సినిమా చూపిన ధైర్యం, ఆనాటి మేకింగ్ విలువలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతాయి సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
