భారతీయ సినీ పరిశ్రమ ప్రస్తుతం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, రాజకీయ చదరంగంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా వస్తున్న కొన్ని చిత్రాలు నిర్దిష్ట రాజకీయ ఎజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ వచ్చిన కొన్ని సినిమాలు మరింత రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
చర్చనీయాంశంగా సినిమాలు!
గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ఇటీవల ‘దురంధర్’ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రాలు వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటుంటే, మరికొందరు ఇవి కేవలం ప్రచార చిత్రాలు అని కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా ‘దురంధర్’ చిత్రంలో ప్రధాని మోదీకి సంబంధించిన విజువల్స్ వాడటం, అతివాద జాతీయవాదాన్ని ప్రదర్శించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ప్రధానిపై ప్రకాశ్ రాజ్ విమర్శలు..
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు ‘దురంధర్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దీనిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నరేంద్ర మోదీ ప్రస్థానం టీ అమ్మడం నుంచి సినిమాలు అమ్మే స్థాయికి చేరుకుంది అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సినిమాలను వాడుకోవడం ఆయన నిరాశకు, అసహనానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఎప్పుడూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిర్మొహమాటంగా ఎండగట్టే ఆయన, ఈసారి నేరుగా ప్రధానిని లక్ష్యం చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.
►ALSO READ | హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి.. దిల్ రాజు క్రేజీ ఆఫర్..!
సినిమా రాజకీయ ప్రచార సాధనమా?
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, సినిమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. కళాకారులుగా ఉండాల్సిన వారు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మారుతున్నారా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. వెండితెరపై చూపించే దృశ్యాలు సామాజిక వాస్తవాలా లేక ఓట్ల వేటలో భాగంగా రూపొందించిన కట్టుకథలా? అన్న భావన ప్రేక్షకుల్లో ఉండిపోయిందన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా అనేది సమాజానికి అద్దం పట్టాలి, కానీ అది ఒక పార్టీకి లేదా సిద్ధాంతానికి ఊతమిచ్చేలా ఉంటే కళ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఏది ఏమైనా, ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
From selling chai to selling films .. can you see the Desperation phrends ..#justasking https://t.co/q095go9PDN
— Prakash Raj (@prakashraaj) April 5, 2026
