Purushaha OTT: పెళ్లి తర్వాత జరిగే గొడవలపై ఫన్ ట్రీట్.. రెండు ఓటీటీల్లో టాప్‌ ట్రెండింగ్లో ‘పురుష:’

Purushaha OTT: పెళ్లి తర్వాత జరిగే గొడవలపై ఫన్ ట్రీట్.. రెండు ఓటీటీల్లో టాప్‌ ట్రెండింగ్లో ‘పురుష:’

భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు, కోర్టుల చుట్టూ తిరిగే విడాకుల గొడవలు ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. దీనికి కాస్త వినోదం, ఇంకొంచెం సెంటిమెంట్ జోడించి 'కళ్యాణ్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’(Purushaha). వీరు వులవల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతూ.. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్ వంటి భారీ కామెడీ బలగంతో మే 22, 2026న థియేటర్లలోకి వచ్చింది.

ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి చేరి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా యూత్ మరియు, కొత్తగా పెళ్ళైన జంటలకు కనెక్ట్ అవుతూ అలరిస్తుంది. మరి సినిమా కథేంటో ఓ లుక్కేయండి. 

విడాకుల ట్రాక్‌లో మూడు జంటల కథ:

గోవింద్ (పవన్ కళ్యాణ్), శ్రీను (కసిరెడ్డి), సత్తి (సప్తగిరి) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరి గ్యాంగ్‌లోనే క్రియేటివ్ కిస్సు అలియాస్ కిషోర్ (వెన్నెల కిషోర్) కూడా ఉంటాడు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రాణ స్నేహితులైన గోవింద్, శ్రీను, సత్తి ముగ్గురికీ పెళ్లయిన ఏడాదికే భార్యలతో గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు.

గోవింద్‌ను ప్రాణంగా ప్రేమించిన కమల (రాయంచ), భర్త ప్రాబ్లమ్ తెలిసికూడా అండగా నిలిచిన గీత (విషిక), బిజినెస్‌లో లాస్ అయినా సత్తిని వదలని లక్ష్మీ (హాసిని సుధీర్).. అసలు ఎందుకు విడాకులు కావాలంటారు? వీరి సంసారాల్లో నిప్పులు పోసిన ఆ 'క్రియేటివ్ కిస్సు' ఎవరు? చివరికి ఈ జంటలు ఎలా ఒకటయ్యాయి అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే:

ఈ మధ్య కాలంలో ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడంలో దర్శకుడు వీరు వులవల చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పెళ్లయిన ప్రతి మగాడు ఈ కథకు ఈజీగా కనెక్ట్ అవుతాడు. 

ఫుల్ ఆన్ ఫన్.. ఎమోషనల్ రన్: ఫస్టాఫ్‌లో మూడు జంటల పరిచయం, కోర్టు సీన్లు, జడ్జ్ ముందు ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ అయ్యే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 20 నిమిషాల వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్ థియేటర్లలో నవ్వుల పండగ తెస్తుంది. అక్కడే ఓ చక్కని ఎమోషనల్ టచ్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

హౌస్ హజ్బెండ్ మ్యాజిక్: ఇక సెకండాఫ్‌లో హీరో వింటేజ్ లవ్ ట్రాక్, కసిరెడ్డి రాజకుమార్ మార్ కు  జంపింగ్ డైలాగ్స్ ప్రతీ చోటా పేలుతాయి. ‘హౌస్ హజ్బెండ్’ కాన్సెప్ట్ చుట్టూ అల్లిన సీన్స్ ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో భార్యాభర్తల బంధం గొప్పతనాన్ని వివరించిన తీరు సినిమాకు పర్ఫెక్ట్ ఎండింగ్‌ను ఇచ్చాయి. కథ ఊహకందేలా సాగినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ ట్రాక్‌తో మేనేజ్ చేశారు. ఫైనల్గా.. కొంచెం లవ్, కాస్త ఎమోషన్, బోలెడంత కామెడీ కలగలిపిన 'పురుష:' చిత్రం ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్.