సిట్ విచారణకు కేసీఆర్.. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ

సిట్ విచారణకు కేసీఆర్.. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న వేళ.. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. అదే విధంగా కమిషనర్లు, ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్ లు పంపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఆదివారం (ఫిబ్రవరి01) మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ జరగనున్న క్రమంలో.. సెక్యూరిటీ అలర్ట్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు తీసుకొవాలని ఆదేశాలు జారీ చేశారు. 

కేసీఆర్ సిట్ విచారణ వేళ..  బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అదే విధంగా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. అందుకోసం తెలంగాణ భవన్ లో రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు నిరసనగా హైదరాబాదులోని ప్రధాన కూడల్లో ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు. రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగుతుందని ఫ్లెక్సీ లతో టిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ అధికారులను అలర్ట్ చేసింది.