- డాక్టర్లకు కేసీఆర్ భావోద్వేగ విజ్ఞప్తి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్లకు భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్.. ‘ఏం చేస్తారో చేయండి.. ఎలాగైనా మా పెద్దిని కాపాడండి’ అంటూ డాక్టర్లను అభ్యర్థించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో దాదాపు అరగంట పాటు చర్చించి, అందిస్తున్న ట్రీట్మెంట్వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, మరో 48 గంటల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌కు డాక్టర్లు వెల్లడించారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులకు వెనకాడేది లేదని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. మాజీమంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. అలాగే, రాష్ట్ర మంత్రి సీతక్క సైతం యశోద ఆస్పత్రికి వెళ్లి, ట్రీట్మెంట్ పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను కలసి ధైర్యం చెప్పారు. మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
