కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్​లో భయం : రేవంత్ రెడ్డి

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో  కేసీఆర్​లో భయం : రేవంత్ రెడ్డి

 

  • కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో  కేసీఆర్​లో భయం
  • మేమిచ్చిన హామీలను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నడు: రేవంత్ 
  • కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని వ్యాఖ్య 
  • కాంగ్రెస్​కు రాజ్య కాంక్ష లేదు: హిమాచల్ సీఎం సుఖ్విందర్  
  • మేం వచ్చాక ధరణిని రద్దు చేస్తం: భట్టి విక్రమార్క

మహబూబ్​నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు: కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో సీఎం కేసీఆర్​కు భయం పట్టుకుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కర్నాటకలో మేం ఇచ్చిన హామీలను కాపీ కొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. మేం అక్కడ రూ.500 కే సిలిండర్ ఇస్తామని ప్రజల వద్దకు వెళ్లినం. ఇక్కడ కేసీఆర్ ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఫ్రీ సిలిండర్ల పేరుతో ఆడ బిడ్డలను మోసం చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. కానీ, కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరో నాలుగు నెలల్లో బీఆర్ఎస్ సర్కార్ పోతుంది’’ అని అన్నారు. కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే, బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్​ మార్చ్’ పాదయాత్ర గురువారం మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. 

జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేస్తం.. 

‘‘2009లో పాలమూరు ప్రజలు కేసీఆర్​ను ఎంపీగా గెలిపించారు. కానీ, ఆయన ఉమ్మడి జిల్లాను ఎడారిగా మార్చారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో అసంపూర్తిగా ఉన్న ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు” అని రేవంత్ మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన​చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరన్నారు. ‘‘జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆస్తులు పెంచుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసినప్పటికీ, ఈ ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రి కూడా తేలేకపోయారు. లక్ష్మారెడ్డి తన నియోజకవర్గంలో ఏ ఊర్లో డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో.. అక్కడే ఆయన ఓట్లు అడగాలి. అలాగే మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోటే ఓట్లు అడుగుతాం. అప్పుడు ఎవరు డిపాజిట్లు కోల్పోతారో చూద్దామా?’’ అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు–రంగారెడ్డి, నారాయణపేట, కొండంగల్ ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

అధికారంలోకి వస్తే ఓపీఎస్ అమలు: సుఖ్విందర్ సింగ్  

రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ అన్నారు. ‘‘70 ఏండ్ల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి మా పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్​లో పార్టీ పూర్తిగా నష్టపోయింది. ఇక్కడ కూడా పెద్దగా సీట్లు గెలువలేదు. రాష్ట్రం ఇచ్చిన మా పార్టీని ప్రజలు ఆదరించి అవకాశం ఇవ్వాలి’’ అని కోరారు. ‘‘మా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేస్తున్నాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఓపీఎస్ అమలు చేస్తాం. నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం” అని హామీ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ కు రాజ్య కాంక్ష లేదు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవిని త్యాగం చేశారు. దేశంలో అవినీతి, హింసకు వ్యతిరేకంగానే రాహుల్​ గాంధీ ‘భారత్​ జోడో’ యాత్ర చేపట్టారు. అంతేగానీ రాజ్య కాంక్ష కోసం కాదు. విలాసవంతమైన జీవితం, సంపాదన కోసం అధికారంలోకి రావాలని మేమెప్పుడూ అనుకోం. ప్రజలకు సేవ చేయాలన్నదే మా పార్టీ ఉద్దేశం” అని అన్నారు. మండుటెండలో సైతం భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. 

ధరణిని బంగాళాఖాతంలో కలుపుతం: భట్టి

 
రాహుల్​ గాంధీ సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేస్తున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వం పీఆర్ఎల్ఐలో భాగంగా చేపట్టిన లక్ష్మీదేవిపల్లి పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఒక్క ఎకరా భూసేకరణ కూడా చేయలేదు” అని మండిపడ్డారు. ఉద్దండపూర్ రిజర్వాయర్​ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘మరో నాలుగైదు నెలల్లో మేం అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ సర్కార్ గుంజుకున్న భూములను తిరిగి పేదలకు ఇస్తం. కేసీఆర్ తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతం” అని అన్నారు.  సభలో ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, నాగం జనార్దన్​రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో బస్సు యాత్ర: ఠాక్రే 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి మద్దతు ఇస్తారని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్ర పూర్తి కాగానే పార్టీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ యాత్ర అన్ని జిల్లాల్లో సాగుతుందని చెప్పారు. లీడర్లందరూ కలిసి రావాలని, అందరం కలిసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.