హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ మొదలైంది. ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్ నందీనగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఐపీఎస్ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్, ఐపీఎస్ నారాయణ రెడ్డి కేసీఆర్‌ను ఇంటరాగేట్ చేస్తున్నారు. కేసీఆర్ ఇంట్లోని రెండో అంతస్తులో విచారణ జరుగుతోంది. ఒక రూమ్‌లో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సిట్ అధికారులు.
డాక్యుమెంట్స్, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొచ్చారు సిట్ బృందం. కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా విచారణ సమయంలో ఇంట్లో ఉండేందుకు కేటీఆర్‌కు ఒక్కడికే అధికారులు అనుమతి ఇచ్చారు. హరీష్ రావుతో సహ అందరిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణకు భవన్‌కు వెళ్లారు. న్యాయ సహయం కోసం సీనియర్ అడ్వకేట్ రాంచందర్ రావు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు విచారణ సందర్భంగా కేసీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో విచారణ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా నందినగర్‌లో కేసీఆర్ నివాసం వద్ద నాలుగు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నలుగురు డీసీపీలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
