కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన : వైఎస్ షర్మిల

కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన : వైఎస్ షర్మిల

కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలన అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. చిన్న దొర కేటీఆర్ కుటుంబ పాలన అని చెప్తున్నారని.. రాష్ట్రమంతా ఆయన కుటుంబమేనంట అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులు, రైతులు కేటీఆర్ కుటుంబ సభ్యులు కారా..? అని నిలదీశారు. 420కి మారు పేరు కేసీఆర్ అన్న షర్మిల...  కేసీఆర్ ఒక మోసగాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. ఒక్క ఏడాది మాత్రమే పాలన ఉందని, ఇప్పటికైనా హామీలను నిలబెట్టుకోండి అంటూ హితవు పలికారు. 

ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్  అబద్ధాలు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కానీ కేసీఆర్, కేటీఆర్ మాత్రం ఆత్మహత్యలు లేవని అంటున్నారని ధ్యజమెత్తారు. రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు అప్పుల పాలు అయ్యారన్న షర్మిల... ఇదే వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా పంట నష్ట పరిహారం అందలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం లేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో 65 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, రెండో సారి 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం నింపలేదన్నారు.