టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకన్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు ' బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో ఆయన విడుదల చేసే సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తుండటంతో, ట్రేడ్ వర్గాల్లో ఆయనను 'సంక్రాంతి మొనగాడు' అని పిలుచుకుంటున్నారు.
హ్యాట్రిక్ దిశగా అనిల్ రావిపూడి
2025లో విక్టరీ వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ హిట్ కొట్టిన అనిల్, 2026లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు ఇదే ఊపులో తన తదుపరి చిత్రాన్ని కూడా సంక్రాంతికే సిద్ధం చేస్తున్నారు. వరుసగా మూడవ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచి, హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని అనిల్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
క్రేజీ మల్టీస్టారర్
అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టును ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.. ఇందులో విక్టరీ వెంకటేష్‌తో పాటు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో వెంకీతో మంచి కెమిస్ట్రీ కుదిరిన అనిల్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ మార్క్ యాక్షన్‌ను కూడా దీనికి జోడించబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ పంచుకోబోతున్నారనే వార్త సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
కీర్తి సురేష్ ఎంట్రీ?
ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉందని సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన లైన్ నచ్చడంతో ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది క్రేజీ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రిలీజ్ ఎప్పుడు?
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ఉండబోతుందని టాక్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, ఈ మల్టీస్టారర్ చిత్రంతో 2027లో కూడా తన సత్తా చాటుతారనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.
