పద్మారావునగర్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు, స్థిరాస్తి పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించి బ్యాంకుల్లో రూ.4.11 కోట్లు మోసం చేసిన కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసుఫ్ -ఉర్ -రహ్మాన్‌ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు. నకిలీ పత్రాలతో ఇంటి రుణాలు పొంది మోసాలకు పాల్పడిన కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారిగా ఉన్న రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్‌ను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
నిందితులు లేని భూములకు నకిలీ పత్రాలు, జీపీఏ, ఏజీపీఏ పత్రాలను సృష్టించి వాటిని వివిధ అవసరాలకు వినియోగించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయకులను రుణగ్రహీతలుగా చూపిస్తూ వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందారు. ఇప్పటివరకు 11 లావాదేవీల ద్వారా రూ.4.11 కోట్లు కాజేసినట్లు తేలింది. కొద్ది నెలల పాటు ఈఎంఐలు చెల్లించి అనంతరం చేతులెత్తేశారు. బ్యాంకులు డీఫాల్ట్ నోటీసులు జారీ చేసి తనిఖీ చేయగా, ఆస్తులు అసలు లేవని, సర్వే నంబర్లు, ప్లాట్ నంబర్లలో తారుమారయ్యాయని తేలింది. కీసర సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన సమయంలో యూసుఫ్-ఉర్-రహ్మాన్ ఈ లావాదేవీల రిజిస్ట్రేషన్లు చేపట్టి, ఆ పత్రాలను బ్యాంకుల వద్ద సెక్యూరిటీగా ఉంచి రుణాలు పొందేందుకు సహకరించారు. ఆయన ఇంట్లో రిజిస్ట్రేషన్ పత్రాల ప్రతులు, ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
