సీఏఏ రద్దు చేయాలి: కేరళ అసెంబ్లీ తీర్మానం

సీఏఏ రద్దు చేయాలి: కేరళ అసెంబ్లీ తీర్మానం

    దేశంలోనే తొలి రాష్ట్రం

    అధికార ఫ్రంట్​కు కాంగ్రెస్​ సపోర్ట్​

    వ్యతిరేకించిన ఒక్కగానొక్క బీజేపీ ఎమ్మెల్యే

    తమిళనాడు కూడా తీర్మానం చేయాలన్న డీఎంకే

సిటిజన్ షిప్​ సవరణ చట్టాన్ని  (సీఏఏ) రద్దుచేయాలని డిమాండ్​ చేస్తూ కేరళ అసెంబ్లీ  మంగళవారం  తీర్మానాన్ని ఆమోదించింది.  సీఏఏను రద్దుచేయాలని డిమాండ్​ చేస్తూ అసెంబ్లీ లో  తీర్మానం చేసిన  కేరళ దేశంలోనే తొలి రాష్ట్రం.  ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో​  సీఏఏను అమలుచేయబోమంటూ  ప్రకటించాయి. అయితే  లెజిస్లేచర్​ మార్గాన్ని ఎంచుకుని  సీఏఏను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం మాత్రం కేరళనే. రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి అధికార సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్​కి  కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ప్రతిపక్ష యూడీఎఫ్​ తీర్మానానికి సపోర్ట్​చేసింది. మంగళవారం  జరిగిన అసెంబ్లీ  ప్రత్యేక  సమావేశంలో  ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 140 మంది సభ్యులున్న  సభలో బీజేపీ  ఒక్కగానొక్క ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్​ మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించారు.ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష నాయకుడు  రమేశ్​ చెన్నితల  దానికి సపోర్ట్​చేశారు.  సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ..సెక్యులర్​ భావాలకు, దేశంలో భిన్న సంస్కృతులకు సీఏఏ వ్యతిరేకమని చెప్పారు.  మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం దారుణమన్నారు. దేశప్రజల్లో నెలకొన్న  భయాందోళనల నేపథ్యంలో   సీఏఏ రద్దుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని,  రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్​సూత్రాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరారు.

రాష్ట్రంలో డిటెన్షన్​ సెంటర్​ పెట్టం

కేరళలో  ఒక్క డిటెన్షన్​ సెంటర్​ను  ఏర్పాటు చేయబోమని విజయన్​ ఈసందర్భంగా సభ్యులకు హామీ ఇచ్చారు.  కాంగ్రెస్​ నాయకుడు రమేశ్​ చెన్నితల మాట్లాడుతూ సీఏఏను  గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ సపోర్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.  రాజకీయాలకు గవర్నర్​ అతీతంగా ఉండాలని కోరారు. ​ అంతకుముందు సెషన్​ ప్రారంభం కాగానే బిల్లును వ్యతిరేకిస్తూ  రాజగోపాల్​ మాట్లాడారు. సీఏఏ చట్టాన్ని  లోక్​సభ, రాజ్యసభలు రెండూ ఆమోదించినందున.. మళ్లీ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అన్యాయమని అన్నారు. అసెంబ్లీ, లోక్​సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు  మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపేందుకు కేరళ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే సీఏఏకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందువల్ల .. దానిపైనా ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో  ఈ తీర్మానం సభలో ప్రవేశపెట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి.

స్వాగతించిన డీఎంకే

సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ  తీర్మానం చేయడాన్ని డీఎంకే స్వాగతించింది.   రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తమిళనాడు అసెంబ్లీలోనూ ఇదే మాదిరి తీర్మానం చేయాలని డీఎంకే చీఫ్​ ఎం.కె.స్టాలిన్​ మంగళవారం డిమాండ్​చేశారు.  వచ్చే ఏడాది జనవరి 6న జరగబోయే  అసెంబ్లీ సమావేశంలో ఈమేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆయన కోరారు. పార్లమెంట్​లో సీఏఏకు ఏఐఏడీఎంకే మద్దతు
తెలిపింది.

ఏ రాష్ట్రానికి ఆ పవర్ లేదు

సిటిజన్​షిప్ కు సంబంధించిన ఏదయినా చట్టం ఆమోదించే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేరళతో సహా ఏ రాష్ట్ర అసెంబ్లీకి సిటిజన్ షిప్ పై చట్టాలు చేసే అధికారం లేదని చెప్పారు. మంగళవారం సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్టు(సీఏఏ)ను రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే రవిశంకర్ ప్రెస్ మీట్​లో ఈ కామెంట్ చేశారు. సీఏఏ ఇండియన్​సిటిజన్స్ కు సంబంధం లేనిదని, అది సిటిజన్​షిప్​ను సృష్టించడం గాని, తొలగించడం గాని చేయదని అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్​గాంధీలు వరుసగా ఉగాండా, శ్రీలంక కు చెందిన మైనార్టీలకు సిటిజన్​షిప్ కల్పించారని ఆయన గుర్తుచేస్తూ అదే పని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్​షా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఏఏ పూర్తిగా చట్టబద్ధం, రాజ్యాంగ బద్ధమైనదని, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి