కేరళలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగింపు

కేరళలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగింపు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన శనివారం విధుల్లో చేరిన వెంటనే కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఆరోగ్యశాఖా బాధ్యతలు చేపట్టిన మంత్రి వీణా జార్జ్ తో కూడా చర్చించారు. తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలను త్రిపుల్ లాక్ డౌన్ నుంచి  మినహాయించారు. అయితే మలప్పురం జిల్లాలో మాత్రం త్రిపుల్ లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా కేసులు తీవ్రంగా వ్యాపిస్తున్నందున తప్పనిసరి పరిస్తితుల్లో ట్రిపుల్ లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కేరళ సర్కార్ త్రిపుల్ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. మే 16 నుంచి 23 మే వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుంది. అయితే కేసులు ఏమాత్రం తగ్గడం లేదు.. గడచిన 24 గంటల్లో 29,673 కేసులు నమోదయ్యాయి. కరోనా ట్రీట్మెంట్ పొందుతున్న 41,032 మంది కరోనా నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించినా 142 మంది ప్రాణాలను కోల్పోవడం బాధకరమని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. తొలిదశ కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే ఇప్పుడు కూడా కరోనాను కఠినంగా సమూలంగా పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని.. ప్రజలు సహకరించాలని కోరారు.