ఏఐ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి టెక్ దిగ్గజం జాక్ డోర్సీ తీసుకున్న తాజా నిర్ణయమే ఒక నిదర్శనం. తన ఫిన్‌టెక్ సంస్థ 'బ్లాక్'లో ఏకంగా 4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కంపెనీ నష్టాల్లో ఉన్నదనో, ఆర్థిక ఇబ్బందుల వల్లో ఈ నిర్ణయం తీసుకోలేదని, కేవలం 'ఏఐ' సామర్థ్యం మీద నమ్మకంతోనే ఈ సాహసం చేస్తున్నానని ఆయన చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జాక్ డోర్సీ: చిన్న టీమ్ - పెద్ద ఫలితం
కంపెనీలను నడిపే విధానాన్ని ఏఐ పూర్తిగా మార్చేసిందని అంటున్నారు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ. తెలివైన ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాక, వందల మంది చేసే పనిని చాలా తక్కువ మందితో, ఇంకా మెరుగ్గా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. చాలా కంపెనీలు ఈ నిజాన్ని గుర్తించడంలో వెనుకబడి ఉన్నాయని, తాను మాత్రం ముందుగానే మేల్కొన్నానని అభిప్రాయపడ్డారు. తొలగించిన ఉద్యోగులకు 20 వారాల జీతం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తూనే.. ఏఐ ఆధారిత భవిష్యత్తు వైపు బ్లాక్ అడుగులు వేస్తోందని చెప్పారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి దీనిపై తనదైన శైలిలో స్పందించారు. ఏఐ ధనికులను మరింత ధనికులను చేస్తుందని కుండబద్దలు కొట్టారు. జాక్ డోర్సీ నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఉద్యోగిలా ఆలోచిస్తే మీ పనిని ఏఐ భర్తీ చేస్తుంది, మీరు ఉపాధి కోల్పోతారని అన్నారు కియోసాకి. ఇక యజమానిలా ఆలోచిస్తే.. ఏఐని ఒక పనిముట్టుగా వాడుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించి మరింత సంపన్నులు అవుతారు.
అంటే మీరు ఏఐకి వ్యతిరేకంగా పోరాడటం కంటే.. ఏఐని మీ కోసం పని చేసేలా మార్చుకోటం బెటర్ అని సూచిస్తున్నారు కియోసాకి.
2028 ఆర్థిక సంక్షోభం?
ఇదే సమయంలో 'సిట్రిని రీసెర్చ్' విడుదల చేసిన 'ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్' రిపోర్ట్ మార్కెట్లలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇది ఒక ఊహాజనిత నివేదిక అయినప్పటికీ.. ఏఐ వల్ల వచ్చే ప్రమాదాలను కళ్లకు కట్టినట్లు చూపింది. ఏఐ వల్ల ఉత్పత్తి పెరుగుతుంది దీనినే ఘోస్ట్ జీడీపీ అన్నారు. కానీ మనుషులకు ఉద్యోగాలు ఉండవు. ప్రజల దగ్గర డబ్బు లేకపోతే కొనుగోళ్లు తగ్గుతాయి. తద్వారా 2028 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని రిపోర్ట్ హెచ్చరించింది.
మనం ఏం చేయాలి?
జాక్ డోర్సీ లేఆఫ్స్, కియోసాకి హెచ్చరికలు గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకోని వారు వెనుకబడిపోతారు. ఏఐ అనేది మనుషులను భర్తీ చేయడం కంటే, ఏఐని వాడటం తెలిసిన మనిషి.. ఏఐ తెలియని మనిషిని భర్తీ చేసే కాలం వచ్చేసింది. సాంప్రదాయ ఉద్యోగ పద్ధతుల కంటే.. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్.. సరికొత్త సాంకేతిక నైపుణ్యాలే భవిష్యత్తులో మనల్ని కాపాడతాయి. మెుత్తానికి జాక్ డోర్సీ నిర్ణయం టెక్ ప్రపంచంలో ఒక 'వేక్-అప్ కాల్'. ఏఐ అనేది ఒక సవాల్ మాత్రమే కాదు, తెలివిగా వాడుకుంటే అదొక అద్భుతమైన అవకాశం కూడా అని తెలుస్తోంది.
