కాంగ్రెస్ నిర్ణయానికి మోస్ట్ వెల్ కమ్ : కేరళ గవర్నర్

కాంగ్రెస్ నిర్ణయానికి మోస్ట్ వెల్ కమ్ : కేరళ గవర్నర్

తిరువనంతపురంతనపై అసెంబ్లీలో రీకాల్ తీర్మానాన్ని ప్రవేశపెడతామన్న ప్రతిపక్ష కాంగ్రెస్ ప్లాన్​ను స్వాగతిస్తున్నట్లు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నానని అన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించినందుకు, శాసన సభ గౌరవానికి భంగం కలిగేలా బహిరంగంగా ప్రశ్నించినందుకు గవర్నర్‌పై రీకాల్ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని అపొజిషన్ లీడర్ రమేశ్ చెన్నితాల శనివారం అసెంబ్లీలో ప్రకటించిన కొద్ది సేపటికే గవర్నర్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు. వాళ్ల నిర్ణయానికి మోస్ట్ వెల్​కమ్​. నేను రాష్ట్ర గవర్నర్ గా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం, ప్రోత్సహించడం, హెచ్చరించడం నా కర్తవ్యం. సుప్రీంకోర్టు కూడా ఈ విషయం అర్థం చేసుకుంటుంది’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేరళ ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణలు లేవని చెప్తూనే తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించటానికి రాష్ట్రం తీసుకున్న చర్య సరైనది కాదన్నారు. అంతకుముందు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ చేసిన తీర్మానం అంశాన్ని ప్రస్తావించకుండా, రూల్స్ ప్రకారం ఇందులో రాష్ట్ర అభివృద్ధి అంశాలు మాత్రమే ఉండాలని గవర్నర్ సూచించారు. సీఏఏ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనందున బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని, ఆ విషయం సబ్ జ్యుడీషియల్ మేటర్ కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదని రాజ్​భవన్ అధికారి ఒకరు ప్రకటించారు. అయితే తాము స్పీకర్ పర్మిషన్ తీసుకుని సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, దానిని గవర్నర్ బహిరంగంగా సవాల్ చేస్తున్నారని రమేశ్ ఆరోపిస్తున్నారు.