1. యుద్ధానికి బ్రేక్: లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని ఇరాన్, అమెరికా అంగీకరించాయి. ఇకపై ఒకరిపై ఒకరు సైనిక చర్యలకు దిగకూడదని, బెదిరింపులకు పాల్పడకూడదని నిర్ణయించాయి. అలాగే లెబనాన్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించేందుకు అంగీకరించాయి.
2. పరస్పర గౌరవం: రెండు దేశాలు పరస్పరం సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి.
3. 60 రోజుల్లో ఫైనల్ డీల్: రెండు దేశాలు గరిష్ఠంగా 60 రోజుల్లో ఫైనల్ డీల్ కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. అవసరమైతే పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకోవచ్చు.
4. దిగ్బంధనానికి ముగింపు: ఇరాన్‌పై అమెరికా అమలు చేస్తున్న సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తుంది. 30 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఈ టైంలో నౌకల రాకపోకల విషయంలో యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులను ఇరాన్ పునరుద్ధరిస్తుంది. ఫైనల్ డీల్ అనంతరం 30 రోజుల్లో అమెరికా తన బలగాలను ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటుంది.
5. మైన్ల నిర్వీర్యం: ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత 60 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్,- ఒమన్ మధ్య ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేయదు. సముద్రంలో అమర్చిన మైన్లను నిర్వీర్యం చేసి హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను 30 రోజుల్లో పునరుద్ధరిస్తుంది. హార్మూజ్ జలసంధి భవిష్యత్ పరిపాలన, సముద్ర సేవలపై ఒమన్‌తో పాటు ఇతర గల్ఫ్ తీర దేశాలతో చర్చలు జరుపుతుంది.
6. ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు: ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల(రూ. 28.30 లక్షల కోట్లు)తో కూడిన ప్రణాళికను రూపొందించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ ప్రణాళిక అమలు విధానాన్ని ఫైనల్ డీల్ చేసుకునే నాటికి ఖరారు చేస్తారు.
7. ఆంక్షల ఎత్తివేత: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల కింద విధించిన ఆంక్షలతోపాటు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బోర్డు తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలను షెడ్యూల్ ప్రకారం ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఫైనల్ డీల్‌లో ఈ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.
8. అణ్వాయుధాలపై హామీ: తాము అణ్వాయుధాలను తయారు చేయబోమని, సేకరించబోమని, కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల నిర్వహణపై ఐఏఈఏ పర్యవేక్షణలో ఒక విధానాన్ని రూపొందించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఇరాన్ అణు అవసరాలకు సంబంధించిన యురేనియంపై కూడా ఫైనల్ డీల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాయి.
9. యథాతథ పరిస్థితి: శుద్ధిచేసిన యురేనియం సమస్యకు పరిష్కారం లభించేవరకు ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న యథాతథ పరిస్థితినే కొనసాగించేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. అంటే అమెరికా కొత్త ఆంక్షలు విధించదు. ఆ ప్రాంతంలో అదనపు సైన్యాన్ని మోహరించదు.
10. ఎగుమతులకు అనుమతులు: ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు, బ్యాంకింగ్, బీమా, రవాణా వంటి సేవలకు అమెరికా ఆర్థిక శాఖ ప్రత్యేక మినహాయింపులు ఇస్తుంది.
11. నిధులు విడుదల: విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు, ఆస్తులను పూర్తిగా వినియోగించుకునేలా అమెరికా అనుమతిస్తుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను చర్చల ద్వారా ఖరారు చేస్తారు.
12. అమలుపై పర్యవేక్షణ: ఈ ఎంఓయూ, భవిష్యత్తులో కుదిరే ఫైనల్ డీల్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి.
13. తదుపరి చర్చలు: ఈ ఎంఓయూలోని మొదటి, నాలుగో, ఐదో, పదో, పదకొండో అంశాల్లోని చర్యలు ప్రారంభమై, వాటి అమలుపై హామీ లభించిన తర్వాత మిగిలిన అంశాలపై ఫైనల్ డీల్ చర్చలు కొనసాగుతాయి.
14. తీర్మానం ద్వారా ఆమోదం: ఫైనల్ డీల్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిబంధనలకు కట్టుబడిన తీర్మానం ద్వారా ఆమోదం లభిస్తుంది.
