తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షలో గత 15 సంవత్సరాల నుంచి 21వేల మందికి పైగా పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని ఇప్పటి వరకు క్రమబద్ధీకరించి కనీస వేతనం చెల్లించక పోవడం వలన ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షాలో వివిధ విభాగాలు అయిన కేజీబీవీ, యూఆర్ ఎస్, భవిత, మండల విద్యా వనరుల కేంద్రాలలో, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో బోధన, బోధనేతర సిబ్బందిగా రోస్టర్, మెరిట్, రూల్ అఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికై గత15 సంవత్సరాలనుంచి విద్యాశాఖలో కీలకంగా ఉంటూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయినా వీరికి ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ఆరోగ్య భద్రత కూడా లేకుండా అన్యాయానికి గురవుతున్నారు. భారత సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పు చెప్పింది.
2018 పీఆర్సీ కమిటీ తమ నివేదికలో ప్రతి కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగికి కనీస వేతనం అమలు చెయ్యాలని సూచన చేసింది. అయినా పాలక వర్గాలు సుప్రీం కోర్టు తీర్పును, పీఆర్సీ నివేదికను పట్టించుకోక పోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది. ఇప్పటికైనా సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగుల ఆర్థిక, సామజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఒడిశా, హర్యాన, ఢిల్లీ, మహారాష్ట్ర లో క్రమబద్దీకరణ చేసినట్టుగానే తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించి, కనీస వేతనం అమలు చెయ్యాలని సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2022–-23 సమావేశంలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఏప్రిల్ 2023 నుంచి ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించి వేతనాలు పెంచుతామని చేసిన ప్రకటనను అమలు చేస్తారని ప్రతి ఉద్యోగి ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
- పల్లె నాగరాజు, టీపీటీఎఫ్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి
